సహకరించని బ్యాంకర్లపై ఫిర్యాదు..
Ens Balu
2
Vizianagaram
2020-12-14 23:02:44
విజయనగరం జిల్లాలో జగనన్న తోడు పథకం అమలుకు సహకరించని బ్యాంకర్లపై రాష్ట్ర స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తామని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ చెప్పారు. జగనన్న తోడు పథకంలో అర్హులైన నిరుపేద కుటుంబాలకు బ్యాంకుల ద్వారా రుణ సహాయం అందించాలని పదేపదే బ్యాంకు అధికారులను కోరుతున్నప్పటికీ వారి నుండి తగినంతగా స్పందన వ్యక్తం కావడం లేదని, అందువల్లే రాష్ట్ర స్థాయి అధికారులకు ఫిర్యాదు చేయాల్సి వస్తోందన్నారు. పొరుగు జిల్లాలతో పోల్చిచూస్తే మన జిల్లాలో జగనన్న తోడు పథకం కింద రుణాల మంజూరులో బ్యాంకులు ఎంతగా వెనకబడి వున్నాయో స్పష్టంగా తెలుస్తోందని పేర్కొన్నారు. బ్యాంకులు పేదల గురించి ఆలోచన చేయకుండా, సామాజిక బాధ్యత తీసుకోకుండా వుంటే సహించేది లేదని స్పష్టంచేశారు. జగనన్న తోడు పథకం అమలుపై జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ సోమవారం కలెక్టర్ ఆడిటోరియంలో ఎంపిడిఓలు, మండల ప్రత్యేకాధికారులు, బ్యాంకుల జిల్లాస్థాయి అధికారులతో సమీక్షించారు.
బ్యాంకుల సహకారం లేకపోవడం వల్లే ఈ పథకం అమలులో రాష్ట్రంలో 8వ స్థానంలో నిలిచామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అర్హులైన వారందరికీ రుణాలు ఇవ్వాలని, రుణాల మంజూరుకు సంబంధించి డాక్యుమెంటషన్‌లో గ్రామ సచివాలయ సిబ్బంది నుండి పూర్తిస్థాయి సహకారం అందిస్తున్నా వారు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అత్యంత తక్కువగా రుణాలు మంజూరు చేసిన బ్యాంకుల అధికారుల నుండి వివరణ కోరారు. రుణాల మంజూరుకు సహకరించిన ఆయా బ్యాంకుల బ్రాంచి మేనేజర్లతో కలెక్టర్ నేరుగా ఫోనులో మాట్లాడి ఏ కారణంతో రుణాలు మంజూరులో జాప్యం జరుగుతున్నదని ప్రశ్నించారు. అదేవిధంగా ఇప్పటికే రుణాలు మంజూరు చేసిన లబ్దిదారులకు సంబంధించిన సమాచారం వెంటనే వెబ్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు.
బ్యాంకులు ఇదే విధంగా వుంటే జిల్లాలోని బ్యాంకులు ధనికుల కోసమే అన్న భావన ప్రజల్లో ఏర్పడుతుందని, ఈ ధోరణి మంచిది కాదని జాయింట్ కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్ అన్నారు. ప్రభుత్వ పథకాలకు సహకరించని బ్యాంకు బ్రాంచిల జాబితా తమకు అందజేస్తే వారితో ప్రత్యేకంగా మాట్లాడి కారణాలు తెలుసుకుంటామన్నారు. ఏపి గ్రామీణ వికాస్ బ్యాంకు వంటి అధిక బ్రాంచిలు వున్న బ్యాంకులు తగిన సామర్ధ్యం ప్రదర్శిస్తేనే అధికంగా రుణాలు అందించగలమని కలెక్టర్ పేర్కొన్నారు. ఏపిజివిబి ద్వారా ఈ ఒక్కరోజే 500 మందికి రుణాలు అందించనున్నామని విజయనగరం ప్రాంతీయ మేనేజర్ చెప్పారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు, డి.ఆర్.డి.ఏ. ప్రాజెక్టు డైరక్టర్ కె.సుబ్బారావు, అసిస్టెంట్ కలెక్టర్ కె.సింహాచలం, జిల్లాపరిషత్ సి.ఇ.ఓ. టి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.