ఆ మూడు పథకాలకు ప్రత్యే ప్రణాళిక..
Ens Balu
3
Vizianagaram
2020-12-15 22:00:54
జగనన్న తోడు, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ చేయూత పథకాల అమలుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేసింది. యుద్దప్రాతిపదికన యూనిట్లను స్థాపించేందుకు వ్యూహాత్మక కార్యక్రమాన్ని రూపొందించారు. దీనిలో భాగంగా పథకం అమలును పర్యవేక్షించేందుకు జిల్లా అధికారులతో కూడిన మూడంచెల బృందాలను నియమించారు. నిరంతర పర్యవేక్షణకు జిల్లా కేంద్రంలో వార్‌రూమ్‌ను ఏర్పాటు చేశారు. జిల్లా అధికారులతో కూడిన కోర్‌టీమ్ ఇక్కడినుంచి పర్యవేక్షిస్తుంది. అదేవిధంగా క్షేత్రస్థాయిలో మండలాలకు సైతం ప్రత్యేక పర్యవేక్షణాధికారులను నియమించారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా మరో అధికారుల బృందాన్ని సైతం ఏర్పాటు చేశారు.
ప్రణాళిక అమలు కోసం స్థానిక డిఆర్‌డిఏ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక వ్యూహాత్మక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న తోడు, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ చేయూత పథకాల అమలును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. నిర్లిప్తతను, నిర్లక్ష్యాన్ని విడనాడి, ఈ నెల 20 లోగా ఈ పధకాల లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. దీనికోసం ప్రత్యేక వ్యూహాత్మక కార్యక్రమాన్ని రూపొందించామని, దీనిలో భాగంగా మంగళవారం నుంచీ ప్రతీ గంటకూ దీనిపై సమీక్ష ఉంటుందన్నారు. క్షేత్రస్థాయిలో మండలాలకు ఐటిడిఏ పివో, జాయింట్ కలెక్టర్(ఆసరా), సబ్ కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్, ఆర్‌డిఓ, డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారులను ప్రత్యేక పర్యవేక్షణాధికారులను నియమించామని, వీరు నేరుగా ఆయా బ్యాంకు అధికారులతో మాట్లాడి, యూనిట్ల గ్రౌండింగ్‌కు కృషి చేస్తారన్నారు. అలాగే క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఎదురైతే, వాటిని విశ్లేషించి, పర్యవేక్షించేందుకు జిల్లా కేంద్రం నుంచి ఒక కోర్‌టీమ్ ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటలు వరకూ సిద్దంగా ఉంటుందన్నారు. వివిధ శాఖల పరంగా ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి, సాంకేతిక సహకారాన్ని అందించేందుకు క్రైసిస్ మేనేజ్‌మెంట్ టీమ్ ఆధ్వర్యంలో, ఆయా శాఖల సిబ్బంది సైతం కంట్రోల్ రూములో అందుబాటులో ఉంటారని చెప్పారు. వీరంతా బ్యాంకర్లతో అనుసంధానమై, యూనిట్లను స్థాపించేందుకు కృషి చేస్తారని చెప్పారు. మొత్తం కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్(అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్‌కుమార్ పర్యవేక్షిస్తారని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు, అసిస్టెంట్ కలెక్టర్ కె.సింహాచలం, డిఆర్‌డిఏ పిడి కె.సుబ్బారావు, మెప్మా పిడి కె.సుగుణాకరరావు, మున్సిపల్ కమిషనర్ ఎస్ ఎస్ వర్మ, డిఆర్‌డిఏ అధికారులు పాల్గొన్నారు.