నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి..
Ens Balu
3
Visakhapatnam
2020-12-15 22:07:27
విశాఖ నగరాన్ని మరింత పరిశుభ్రంగా తీర్చిదిద్దే బాధ్యత నగర ప్రజలపై ఉందని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన పేర్కొన్నారు. పరిశుభ్రత పాటించకుండా బహిరంగ ప్రదేశాలల్లో మలమూత్ర విసర్జన చేసేవారికి జరిమానా తప్పదని జివిఎంసి కమిషనర్ హెచ్చరించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ – 2021లో ఉత్తమ ర్యాంకు సాధించడానికి చేపడుతున్న పలు పనులు పురోగతిని మంగళవారం, వి.ఎం.ఆర్.డి.ఏ. చిల్ద్రెన్ ఎరేనా థియేటర్ లో అదనపు కమిషనరు, సి.ఎం.ఓ.హెచ్., ఏ.ఎం.ఓ.హెచ్.లు, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్ స్పెక్టర్లు, వార్డు శానిటరీ కార్యదర్శులతో కూడుకొని సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్వచ్ఛ సర్వేక్షణ్ – 2021లో ఉత్తమ ర్యాంకు సాధనకు నగర ప్రజలతో పాటూ, అధికారులు, చిరు ఉద్యోగులు కూడా కృషి చేయాలన్నారు. నగరంలో బహిరంగ మల మూత్ర విసర్జన నిషేదమని, ఆరుబయట ఎవ్వరైనా మల మూత్ర విసర్జన చేస్తే అపరాధ రుసుం వసూలు చేయాలని శానిటరీ ఇన్స్ స్పెక్టర్లను, వార్డు శానిటరీ కార్యదర్శులను ఆదేశించారు. ప్రజా మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, వాటికి కావలసిన పరికరాలు, బ్లీచింగు, ఫినాయల్ వంటివి అందుబాటులో ఉంచాలన్నారు. కాలువలలో చెత్త వేయరాదని, కాలువలలో చెత్త వేసిన వారికి కూడా జరిమానా విధించాలన్నారు.
పెద్ద కాలువలలో పూడికలు తీసే చర్యలు చేపట్టి, ప్లాస్టిక్ వంటివి పారకుండా ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేయాలని, కాలువలపై చెత్త వేయరాదని బోర్డులు పెట్టాలన్నారు. ప్రతీ రోజూ వార్డు శానిటరీ కార్యదర్శులు ఉదయం 6.00గంటల నుండే వీధులను తనిఖీ చేయాలని, ఎక్కడా చెత్త లేకుండా దగ్గరుండి చెత్తను తరలించాలని ఆదేశించారు. ప్రతీ ఇంటి నుండి చెత్త నేరుగా సేకరించి, వాహనాల ద్వారా డంపింగు యార్డుకు తరలించాలన్నారు. ఇంటి నుండి సేకరించిన చెత్తను వేయకుండా వాహనాలకు అందించే ఏర్పాట్లు చేసుకొని ఆయా ప్రాంతాలలో ఉన్న డంపర్ బిన్సు ను తొలగించాలన్నారు. విధి నిర్వహణలో అంతరాయం ఏర్పడితే వార్డులో కొంత మంది శానిటరీ సిబ్బందిని, మినీ వాహనాన్ని రిజర్వులో ఉంచాలని సూచించారు. నిషేదిత ప్లాస్టిక్ సామగ్రిని అమ్మే వర్తకులపైన, ప్లాస్టిక్ బ్యాగులు వినియోగదారుల వద్ద నుండి ఎక్కువ మొత్తంలో జరిమానా విధించాలని ఆదేశించారు. డబ్ల్యూ+ క్రింద నగరం గుర్తింపునకు గాను రాబోయే స్వచ్ఛ సర్వేక్షణ్ లో దరఖాస్తు చేయబోతున్నందువలన, ఆయా అనుబంద ప్రమాణాలను అనుసరించి, ఇంటి నుండి యు.జి.డి. కనక్షనులు ఏర్పాట్లు చేయడం, సెప్టిక్ ట్యాంకులు, క్లీనింగ్ చేయడం వంటి పనులు త్వరితగతిన పూర్తిచేయాలని నీటి సరఫరా విభాగపు పర్యవేక్షక ఇంజినీరును ఆదేశించారు.
స్వచ్చతా యాప్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేయుటకుగాను అనువుగా, ప్రజలకు అర్ధమయ్యేటట్లు పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాలలో తగు అవగాహన కార్యకమాలు చేపట్టాలని సూచించారు. ఆయా వార్డులనుండి చెత్తను తీసుకుపోయే వాహనాలు గాని, ట్రై సైకిళ్ళకు గాని రిపేర్లు ఎదురైతే, వెంటనే చేయించాలని చెత్తను తీసుకుపోవడానికి ఎటువంటి వాహన అవరోధం కాకుండా చూడాలని కార్యనిర్వాహక ఇంజినీరు (మెకానికల్) వారిని ఆదేశించారు. ఆయా వార్డుల్లో ఇంటి నుండి చెత్తను నేరుగా సేకరించడానికి ఏర్పాటు చేసిన ప్రైవేటు వాహనములు సరిగా వినియోగించుకునే బాధ్యతా, ఆయా వార్డుల శానిటరీ ఇన్స్ స్పెక్తర్లు, ఏ.ఎం.ఓ.హెచ్.లదే అన్నారు. విధి నిర్వహణలో నిర్లిప్తత కనబరిచిన సిబ్బందిపై తగుచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జోనల్ కమిషనర్లు నుండి అసిస్టెంట్ మెడికల్ అధికార్లు, మెకానికల్ విభాగపు ఇంజినీర్లు, శానిటరీ ఇన్స్ స్పెక్తర్లు, శానిటరీ కార్యదర్శులు అందరూ శత శాతం దృష్టి సారించి పారిశుద్ధ్య విభాగపు పనులు క్రమ పద్దతిలో చేపట్టాలన్నారు.ఈ సమావేశంలో అధనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు, సి.ఎం.ఓ.హెచ్. డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, పర్యవేక్షక ఇంజినీరు(నీటి విభాగం) వేణుగోపాల్, అందరు జోనల్ కమిషనర్లు, ఏ.ఎం.ఓ.హెచ్.లు, కార్యనిర్వాహక ఇంజినీరు(మెకానికల్), శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్ స్పెక్తర్లు, శానిటరీ కార్యదర్శులు, మెకానికల్ ఇంజినీరింగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.