నవోదయకు దరఖాస్తుకి గడువు పెంపు..


Ens Balu
4
Srikakulam
2020-12-16 21:03:29

నవోదయ విద్యాలయంలో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల సమర్పణకు గడువును పొడిగించడం జరిగిందని జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ బి.గోవింద రావు తెలిపారు. ఈ మేరకు బుధ వారం ఒక ప్రకటన విడుదల చేస్తూ 6వ తరగతిలో ప్రవేశానికి ఈ నెల 29వ తేదీ వరకు, 9వ తేదీలో ప్రవేశానికి ఈ నెల 31వ తేదీ వరకు గడువు పెంచడం జరిగిందన్నారు. ఇప్పటికే 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులు తమ దరఖాస్తులో తప్పుల సవరణకు ఈ నెల 30,31 తేదీలలో అవకాశం కల్పించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. దరఖాస్తులను www.navodaya.gov.in వెబ్ సైట్ ద్వారా సమర్పించవచ్చని చెప్పారు. సంశయాలు, వివరాలకు నవోదయ విద్యాలయాల ప్రిన్సిపాల్ ను సంప్రదించవచ్చని సూచించారు.           6వ తరగతిలో ప్రవేశానికి వచ్చే ఏడాది ఏప్రిల్ 10వ తేదీన, 9వ తరగతికి వచ్చే ఫిబ్రవరి 13వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. నవోదయ విద్యాలయంలో 2021 -22 విద్యా సంవత్సరానికి 6, 9వ తరగతులలో ప్రవేశానికి ఆన్ లైన్ లో దరఖాస్తులను ఆహ్వానించడం జరిగిందన్నారు. 2020 – 21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్ధులు దరఖాస్తు చేయవచ్చని తెలిపారు. నవోదయ విద్యాలయాల్లో బాలురు, బాలికలకు ప్రత్యేక హాస్టల్ సౌకర్యం, ఉచిత భోజన, వసతులు కల్పించడం జరుగుతుందని, క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎన్.సి.సి,ఎన్.ఎస్.ఎస్ వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.  జెఇఇ మెయిన్స్ వంటి పరీక్షలలో నవోదయ విద్యార్ధులు అధిక సంఖ్యలో ఉత్తీర్ణత సాధిస్తున్న సంగతి విదితమేనని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులు జిల్లాలోగల నవోదయ విద్యాలయంలో చేరుటకు అర్హులని ఆయన వివరించారు. ప్రామాణిక విద్యను పొందుటకు నవోదయ విద్యాలయాలు ప్రత్యేక వేదికగా నిలుస్తాయని, ఈ అవకాశాన్ని ఆసక్తిగల విద్యార్ధులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.