విజ్ఞాన శాస్త్ర బోధన ప్రభావవంతంగా జరగాలి..
Ens Balu
3
ఆంధ్రాయూనివర్శిటీ
2020-12-16 21:05:08
పాఠశాల స్థాయిలో విజ్ఞాన శాస్త్ర బోధన ప్రభావవంతంగా, ఆసక్తిదాయకంగా సాగాల్సిన అవసరం ఉందని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. తన కార్యాలయంలో ఏయూ ఐఏఎస్‌ఇ ఆచార్యులు టి.షారోన్ రాజు, సిక్కిం కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు ఆర్.ఎస్.ఎస్ నెహ్రూ సంయుక్తంగా రచించిన ‘ పెడగాగి ఆఫ్ బయలాజికల్ సైన్స్(ప్రిన్సిపల్స్ అండ్ పెరాడియమ్స్)’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద రెడ్డి మాట్లాడుతూ పాఠశాల విద్య ప్రతీ వ్యక్తి జీవితాన్ని ఎంతో ప్రభావింతం చేస్తుందన్నారు. దీని ప్రాధాన్యతను గుర్తించి తదనుగుణంగా విద్యార్థులకు శాస్త్రీయ అంశాలపై ఆసక్తి కలిగించే దిశగా బోధన జరపాల్సిన అవసరం ఉందన్నారు. దీనికి అధ్యాపకులు ప్రత్యేక నైపుణ్యాలను, బోధన పద్దతులను అవలంభించాలని సూచించారు.
ఉపాధ్యాయ వృత్తిలో అడుగిడే వారికి ఉపయుక్తంగా పుస్తక రచన జరిపిన ఆచార్య షారోన్ రాజు, నెహ్రూలను అభినందించారు. నూతన విద్యా విధానం విద్యార్థి కేంద్రంగా బోధన, అభ్యసనాలు ఆసక్తిదాయకంగా ఉండే విధంగా ప్రోత్సహిస్తోందన్నారు. దీనిని ఆధారంగా చేసుకుని మరిన్ని పుస్తకాలను తీసుకురావాలని రచయితలకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం పాఠశాల విద్యను అత్యధిక ప్రాధాన్యతను కల్పిస్తోందన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన రెడ్డి ప్రభుత్వ పాఠశాల విద్యను బలోపేతం చేయడం, ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడం, నాను-నేడు పథకంతో పాఠశాల స్వరూపాన్ని పూర్తి మార్చివేసి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య గణనీయంగా పెరిగే దిశగా తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. నేడు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రతిభను కనబరుస్తూ రాష్ట్ర విద్య,సర్వతోముఖాభివృద్దికి ఉపయుక్తంగా నిలుస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి దార్శినికంగా చేపడుతున్న పథకాలు, నిర్ణయాలు రాష్ట్ర విద్యా వ్యవస్థను కొత్త శక్తిని అందిస్తోందన్నారు.