ప్రతీ గ్రామానికి శుద్ధ జాలాలు..
Ens Balu
4
Srikakulam
2020-12-16 21:09:24
ఉద్దాన ప్రాంతంలోని పలాస, ఇచ్చాపురం నియోజవర్గ పరిధిలోని 807 గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఇంటింటికి శుద్ధ జలాలు అందించే వైయస్సార్ సుజలధార బృహత్తర పథకం పనులకు శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర పశుసంవర్ధక , పాల ఉత్పత్తి, మత్స్యశాఖ మంత్రి డా, సీదిరి అప్పలరాజు అన్నారు. బుధవారం నియోజకవర్గంలోని వజ్రపుకొత్తూరు మండలం బెండి కొండపై ఎస్.డి. పి, ఎస్ డి ఎస్ నిధులు అంచనా వ్యయం రూ.700 కోట్లతో నిర్మించనున్న ఉద్ధానం సమగ్ర రక్షిత మంచినీటి సరఫరా పథకం 150 కే ఎల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులకు రాష్ట్ర డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తో కలిసి భూమిపూజ నిర్వహించారు. అనంతరం బెండి జంక్షన్ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మంత్రి డా, సీదిరి రాజు మాట్లాడుతూ వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టు కింద గిరిజన గ్రామాల తో పాటు ఇంటింటికి పైప్ లైన్ ద్వారా శుద్ధ జలాలు అందించి శాశ్వత పరిష్కారం చూపించనున్నామన్నారు. అందులో భాగంగా హిరమండలం రిజర్వాయర్ ద్వారా మిగులు జలాలను వినియోగించుకొని నియోజకవర్గాల్లోని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ఏర్పాటు చేయడం ద్వారా గ్రామాల్లోని రక్షిత మంచినీటి పథకాలకు అనుసంధానం చేసి గ్రామాలకు తాగునీరు అందించను న్నామని తెలిపారు.
ఈ ప్రాంత ప్రజలకు శుద్ధ జలాలు అందించి కిడ్నీ వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర లో ప్రతి ఇంటికీ వెళ్ళి ప్రజల గుండెచప్పుడు విన్నారని అందులో భాగంగానే పలాస లో 200 పడకల కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రి ని మంజూరు చేశారని అన్నారు. అలాగే పలాస డయాలసిస్ సెంటర్ లో పడక ల సంఖ్య పెంపు, హరిపురం లో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసి రూ.2.50 కోట్లతో ఆధునీకరణ పనులకు నిధులు మంజూరు చేశారన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల 15 వేలు పింఛను అందిస్తున్నారన్నారు. నాడు నేడు క్రింద అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నామని చెప్పారు. మత్స్యకారులు కోరికమేరకు మండలంలోని మంచినీళ్లు పేట జట్టీ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. రెండు నెలల్లోగా భావనపాడు పోర్టు టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి ముఖ్యమంత్రి చేతుల మీదగా పనులను ప్రారంభించి జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి వలసల నివారణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిసిఎమ్ సి చైర్మన్ పిరీయా సాయిరాజ్, పలాస ఏ ఎమ్ సి అధ్యక్షులు పి.వి.సతీష్, యాదవ కార్పొరేషన్ చైర్మన్ అందాల శేషగిరి, పలాస , వజ్రపుకొత్తూరు పిఎ సిఎస్ అధ్యక్షులు మాధవరావు, దువ్వాడ మధు కేశ్వర రావు, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ టి.శ్రీనివాస రావు, ప్రాజెక్ట్ మేనేజర్ లు శాంతి కుమార్, వెంకటేశ్వరరావు, డీ ఈ ఈ లు ఆశాలత, రజాక్, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.