అభివృద్ధి పనులను తనిఖీ చేసిన ఈవో..
Ens Balu
2
Tirumala
2020-12-16 21:12:35
తిరుమలలో వివిధ విభాగాల ఆధ్వర్యంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను బుధవారం టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శంకుమిట్ట, నారాయణగిరి కాటేజీల్లో మరమ్మతులు తుది దశకు చేరుకున్నాయని, వైకుంఠ ఏకాదశి నాటికల్లా భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. భక్తులకు కనువిందుగా ఉండేలా కూడళ్లలోని డివైడర్లలో పూల మొక్కల పెంచాలని ఉద్యానవన విభాగం అధికారులకు సూచించామన్నారు. శ్రీవారి ఆలయ అవసరాల కోసం అటవీ విభాగం ఆధ్వర్యంలో 10 ఎకరాల్లో శ్రీగంధం వనం పెంచుతున్నట్టు చెప్పారు. అంతకుముందు ఎస్ఎంసి సర్కిల్ నుండి ఈవో తనిఖీలు ప్రారంభించారు. గోకులం, నారాయణగిరి, టిబిసి, సర్కిళ్లను పరిశీలించారు. నారాయణగిరి ఉద్యానవనాల్లో పూలమొక్కలు ఎక్కువగా పెంచాలన్నారు. ఎస్వీజీహెచ్ వెనుకగల సబ్ స్టేషన్‌ను పరిశీలించి అక్కడి ముళ్లపొదలు తొలగించాలని సూచించారు.
బాటగంగమ్మ గుడి మార్గంలో ఉపయోగంలో లేని సామగ్రిని తొలగించాలని, సేవా సదన్ వెనుక గల నీటి కుంటను సుందరీకరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఉద్యానవన విభాగంలో పూలు నిల్వ చేసే కోల్డ్ స్టోరేజి, పూలమాలల తయారీ, పలు రకాల పూల మొక్కల పెంపకాన్ని ఈవో పరిశీలించారు. ఈవో వెంట టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, చీఫ్ ఇంజినీర్ రమేష్‌రెడ్డి, ఎస్ఇ-2 నాగేశ్వరరావు, డిఎఫ్‌వో చంద్రశేఖర్, ఉద్యానవన డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్, విజివో బాలిరెడ్డి తదితరులు ఉన్నారు.