రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది..


Ens Balu
2
Srikakulam
2020-12-16 21:19:59

రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ పేర్కొన్నారు.  బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లాలోని రైస్ మిల్లర్లతో ధాన్యం సేకరణపై జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధ్యక్షతన సమావేశం జరిగింది. కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ముఖ్య అతిధిగా విచ్చేసారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతుల పక్షపాతి అని, రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని,  ఇది రైతు ప్రభుత్వం అని అన్నారు.  ముఖ్యమంత్రి ఆలోచనకు అనుగుణంగా అన్ని చర్యలు  తీసుకోవాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికి నాణ్యమైన  బియ్యం పంపిణీ విధానాన్ని త్వరలో ప్రారంభించబోతున్నామని,  దానికి తగ్గట్టుగా  మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాలని చెప్పారు. - రైతుల కోసం కొంత నష్టపోయినా సరే సహాయం చేసే గుణం మిల్లర్లు అలవరచుకోవాలన్నారు.   మిల్లర్ల సమస్యలు తెలుసునని,  ప్రభుత్వానికి వాటి గురించి తెలియ జేస్తామని చెప్పారు. మిల్లర్లు రైతులకు అండగా ఉండాలన్నారు.  రైతులకు లాభం కలిగించే విధంగా ధాన్యం సేకరణకు సహకరించాలన్నారు.  ధాన్యం సేకరణ త్వరిత గతిన చేపట్టాలన్నారు.  రైతులకు సాయమందిద్దామని అన్నారు.                    జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ, జిల్లాలో ధాన్యం సేకరణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయుటకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. గత ఏడాది వచ్చిన సమస్యలు ధాన్యం సేకరణకు ముందుగానే  అధిగమించుటకు చర్యలు చేపట్టామన్నారు.  జిల్లాలో కొత్తగా 44 మిల్లులు వచ్చాయన్నారు.  2.41 లక్షల టన్నుల గిడ్డంగి సౌకర్యం ప్రస్తుతం ఎఫ్.సి.ఐ వద్ద సిద్ధంగా ఉందన్నారు. 3.25 లక్షల టన్నుల గిడ్డంగి సౌకర్యం జిల్లాలో ఉందని తెలిపారు. రాష్ట్రంలో 29 శాతం తక్కువ వర్షపాతం జిల్లాలో నమోదు అయిన జిల్లా  శ్రీకాకుళం  జిల్లా అని, కనీసం 10 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించే అవకాశం వుందని చెప్పారు. రైతులకు సాయమందించే దిశగా ప్రభుత్వం ఉచిత పంటల బీమా అందించిందన్నారు. 1075 విత్తనం  జిల్లాలో  దాదాపు వేయలేదన్నారు. డిడిలు సమర్పించిన వారు ధాన్యం సేకరణ ప్రారంభించాలని తెలిపారు. అత్యధికంగా రైతుల రిజిస్ట్రేషన్ జరిగినది మన జిల్లాలోనేనని, త్వరితగతిన ధాన్యం సేకరణ చేసి పూర్తి సహకారాన్ని అందించాలన్నారు.   మిల్లర్లు  మంచి పేరు తెచ్చుకోవాలని, రైతులకు మంచి ధర ఇవ్వాలని, రైతుల నమోదు ప్రక్రియలో 1.37 లక్షలు మన జిల్లాలో జరిగిందన్నారు. .తేమ శాతాన్ని ప్రామాణిక యంత్రం ద్వారా పరీక్షిస్తున్నామన్నారు.  మిల్లర్లకు సహకారం అందిస్తున్నామని, రైతులకు మిల్లర్లు  లబ్ది కలిగించాలని కోరారు. మిల్లర్ల సంఘం అధ్యక్షులు వాసు మాట్లాడుతూ రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తామని, ఇ - క్రాప్ ను అనుసంధానం చేయాలని కోరారు. ఈ సమావేశానికి జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఏ.కృష్ణా రావు, జిల్లా సరఫరాల అధికారి కె.వి.రమణ, వ్యవసాయ శాఖ జెడి కె.శ్రీధర్, డిసిసిబి సిఇఓ డి.సత్యనారాయణ, మార్కెటింగ్ ఎడి బి.శ్రీనివాసరావు, మిల్లర్లు  తదితరులు పాల్గొన్నారు.