అధికారులు సమన్వయంతో పనిచేయాలి..


Ens Balu
2
వైగాజ్ సిటీ
2020-12-16 21:33:03

మహా విశాఖ నగర పరిధిలో మంజూరు చేయబోతున్న టిడ్కో గృహాల పట్టాల రిజిస్ట్రేషన్లు, ఎల్.పి.సి.లు పంపిణీ కార్యక్రమం రిజిస్ట్రేషన్లకు సమన్వయంతో పనిచేసి జయప్రదం చేయాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన ఆయా శాఖల అధికారులను కోరారు. కార్పోరేషన్ సమావేశ మందిరంలో ఆమె, విశాఖపట్నం ఆర్.డి.ఓ విశాఖ జిల్లా రిజిస్ట్రేషన్ల శాఖ డిప్యూటీ ఇన్స్ స్పెక్టర్ జనరల్, జోనల్ కమిషనర్లు, ఏ.పి.డి.లు, పి.డి. (యు.సి.డి.), తహశీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లతో కలసి పట్టాల పంపిణీ కార్యక్రమం సవ్యంగా నిర్వహించడానికి గాను సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ, కార్పోరేషన్ పరిధిలో 24,192 టిడ్కో గృహాల మంజూరు మరియు రిజిస్ట్రేషన్లు ఈ నెల 25వ తేది నుంచి నిర్వహించవలసి ఉన్నందున వివిధ శాఖలు అధికార్లు, పని విభజన చేసుకొని సమన్వయంతో పనిచేసి, కార్యక్రమానికి ఎటువంటి అవరోధాలు ఏర్పడకుండా పనులు పూర్తిచేయాలని కోరారు. లబ్ది దారులు ఎంపిక లాటరీ ద్వారా పూర్తీచేసి, 20వ తేది నాటికి జోన్ల కమిషనర్లకు అందజేయాలని పి.డి.(యు.సి.డి.)ని ఆదేశించారు. జోనల్ స్థాయిలో, బృందాలను ఏర్పాటు చేసి, రిజిస్ట్రేషన్ నిమిత్తం డాక్యుమెంటేషన్ పనులు 21వ తేది నుండి 23వ తేది వరకు జోనల్ కమిషనర్లు నిర్వహించాలని ఆదేశించారు. సంబందిత లబ్దిదారులు, గృహాలు నిర్మించిన పరిధిలో గల తహశీల్దారుల వద్ద 25వ తేదీ నుండి రిజిస్ట్రేషన్లు నిర్వహించాలని తహశీల్దారులను కోరారు.                            రిజిస్ట్రేషన్లు చేసేవిధానం, తహశీల్దారులకు క్రొత్త గావున, రిజిస్ట్రేషన్ చేసే విధానంపై తహశీల్దారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించాలని రిజిస్ట్రేషన్లు శాఖ డి.ఐ.జి. గారిని కోరారు.  ముఖ్యంగా తహశీల్దార్లు రిజిస్ట్రేషన్ చేయబోతున్న భూమి వివరాలు 22A క్రింద ఉన్నాయా లేదా అని పరిశీలించమన్నారు. నగర పరిధిలో గల సుమారు 8వేల ఎల్.పి.సి.లు కూడ ఇవ్వడానికి తగు చర్యలు చేపట్టాలని తహశీల్దారును కోరారు. 300 అడుగులు గల టిడ్కో గృహాలను ఒక్క రూపాయ విలువతో రిజిస్ట్రేషన్ త్వరితగతిన చేపట్టాలని ముఖ్యంగా ఈ సంఖ్య ఎక్కువగా గల అనకాపల్లి, గాజువాక సంబందిత జోనల్ కమిషనర్లు, తహశీల్దార్లు మరింత శ్రద్ద వహించాలని సూచించారు. ఈ సమావేశంలో పి.డి.(యు.సి.డి.) వై. శ్రీనివాస రావు, ఆర్.డి.ఓ. కె.పి.కిషోర్, డి.ఐ.జి. (రిజిస్ట్రేషన్ శాఖ) నాగలక్ష్మి, అందరు జోనల్ కమిషనర్లు, ఏ.పి.డి.లు, తహశీల్దార్లు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు, టిడ్కో హౌసింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.