ప్రజోపయోగం కోసమే రైతుబజార్లు..
Ens Balu
6
మచిలీపట్నం
2020-12-16 22:29:33
మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతులు తమ తమ వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించడానికి రైతు బజార్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అని, ఇది ప్రభుత్వం తీసుకొన్న ఒక సామాజిక చొరవ ఇదని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) స్పష్టం చేశారు. బుధవారం ఉదయం ఆయన తన కార్యాలయం వద్ద వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలిసి వారి ఇబ్బందులను గూర్చి స్వయంగా అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని నాని తక్షణ పరిష్కారం సూచించారు. తొలుత మచిలీపట్నం రైతుబజారు లో కూరగాయలు విక్రయించుకొనే కొందరు వ్యాపారులు మంత్రి పేర్ని నానిని కలిశారు. తాము రైతుబాజారులో గుర్తింపు కార్డులు తీసుకోలేదని వాటి గూర్చి అధికారులు పదే పదే తమను అడుగుతున్నారని అవేమీ లేకుండా తమ తమ కూరగాయలను రైతుబజారు లోనే నేరుగా విక్రయించుకొనేందుకు అవకాశం తమరే కల్పించాలని కోరారు.
ఈ విషయమై స్పందించిన మంత్రి మాట్లాడుతూ, రైతుబజారు లో కూరగాయలను విక్రయించుకొనేవారు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు కలిగివుండాలన్నారు. ఏయే ఉత్పత్తులను,ఏ ప్రాంతం నుంచి రైతుబజారుకు తీసుకువస్తున్నారో తదితర వివరాలను తప్పనిసరిగా వీఆర్వో , తహశీల్ధార్లతో కార్డులపై రాయించుకోవాలని ప్రస్తుతం హార్టీకల్చరిస్ట్ సంతకం సైతం ఆ గుర్తింపుకార్డు జారీలో ఉండాలని కొన్ని నియమ నిబంధనలను రూపొందించారన్నారు. ఇవి పాటించడం ఒక మంచి విధానమేనని వారికి నచ్చచెప్పారు. రైతుబజార్ల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు తాజాగా, ఆర్థికంగా అందుబాటులో లభించగలవన్నారు. రైతులు కూరగాయలను తమ పొలంలో స్వయంగా పండించి విక్రయించటం ద్వారా దళారుల ప్రభావం లేకపోవటం వలన ఇతర కూరగాయల మార్కెట్లలో ధరల కంటే రైతు బజారు మార్కెట్‌లో ధరలు తక్కువగా ఉండేందుకు సహాయపడిందన్నారు.
ఈ విధానం పండించే రైతుకు, వినియోగ దారుడికి ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. రైతుబజార్లలో సేవా ఛార్జీలు గాని ఎటువంటి మార్కెట్ ఫీజులు విధించబడవని కూరగాయల పెంపకందారులు, రైతుల కమిటీ రైతు బజార్లలో అమ్మకపు ధరను నిర్ణయిస్తుందన్నారు. జాయింట్ కలెక్టర్ జిల్లాలోని రైతు బజార్ల కో-ఆర్డినేటింగ్ ఆఫీసర్ గా వ్యవహరిస్తారని, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, రైతు బజార్స్ రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షిస్తారు, నియంత్రిస్తారు మరియు సమన్వయం చేస్తారు.రైతు బజార్ యొక్క ప్రధాన లక్ష్యం రైతులకు గిట్ట్టుబాటు ధరను నిర్ధారించడం, నాణ్యమైన తాజా కూరగాయలను వినియోగదారులకు సరసమైన ధరలకు అందించడమే ప్రధానమన్నారు.
స్థానిక రాజుపేటకు చెందిన వేముల స్వప్న లీల అనే మహిళ మంత్రి వద్ద తన కష్టాన్ని చెప్పుకొంది. గత నవంబర్ నెల 15 వ తేదీన వ్యసనపరుడైన తన భర్త అకస్మాత్తుగా చనిపోయారని ఇద్దరు ఆడపిల్లలతో ఎంతో ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపింది. తాను బి ఏ , బిఈడి చదివి ఒక ప్రయివేట్ విద్యాసంస్థలో ఉద్యోగం చేస్తుండగా కరోనా లాక్ డౌన్ కారణంగా జాబ్ పోయిందని తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించి తన కుటుంబాన్ని రక్షించాలని వేడుకొంది.
స్థానిక ఈడేపల్లి కు చెందిన అత్తలూరి లక్ష్మి అనే వృద్ధురాలు మంత్రి పేర్ని నానిని కలిసింది. తనకు జి ప్లస్ 3 ఇల్లు మంజూరైందని , తాను బోదకాలు వ్యాధిగ్రస్తురాలినని సరిగా నడవలేని పరిస్థితితో ప్రస్తుతం బాధపడుతున్నానని తనకు జి ప్లస్ 3 ఇళ్ల మంజూరులో రెండవ ఫ్లోర్ ను అధికారులు కేటాయించడంతో తన ఆరోగ్య దృష్ట్యా తన ఫ్లాట్ ను కింది అంతస్తుకు దయచేసి మార్చాలని మంత్రిని అభ్యర్ధించింది.
మచిలీపట్నం మాచవరానికి చెందిన పుల్లేటి అపర్ణ అనే మహిళ మంత్రికి తన గోడు వినిపించింది. తాను సచివాలయంలో ఏ ఎన్ ఎం ఉద్యోగానికి రాతపరీక్ష రాస్తే l200 ర్యాంక్ వచ్చినప్పటికీ, ఓ సి కేటగిరిలో ఉండటం వలన ఆ ఉద్యోగం పొందలేకపోయానని, తనకు ఎన్నో ఆర్ధిక ఇబ్బందులు, కుటుంబ బాధ్యతలు ఉన్నాయని దయతో తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని వేడుకొంది.
పోర్టురోడ్డులో నివాసముండే కాడి అచ్చెమ్మ అనే వృద్ధురాలు మంత్రి వద్ద తన ఆరోగ్య పరిస్థితిని మంత్రికి వివరించింది. తన గొంతులో చేపముల్లు చిక్కుకొందని దీంతో గొంతు పెగలక తన అవస్థ వర్ణనాతీతంగా ఉందని కన్నీరు పెట్టుకొంది. ఆమె సమస్యపై వెంటనే స్పందించిన మంత్రి తన వ్యక్తిగత కార్యదర్శి నాగరాజు ను పిలిపించి ఆమెను కారులో గుంటూరు తీసుకెళ్లి అక్కడ తాను సూచించే వైద్యుని వద్దకు తీసుకెళ్లి ఆమెకు మెరుగైన వైద్య సహాయం చేయించాలని ఆదేశించారు.