ఇసుక సరఫరాను సులభతరం చేయాలి..


Ens Balu
3
Anantapur
2020-12-16 22:46:37

అనంతపురం జిల్లాల్లో అన్ని అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇసుక సరఫరాను సులభతరం చేయాలని, ఇందుకు అవసరమైన ఇసుక నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది మరియు ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి సాల్మన్ ఆరోక్య రాజ్ లు అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో ఇసుక సరఫరాను సులభతరం చేసి ప్రజలకు అందుబాటులో ఉంచడంలో భాగంగా, బుధవారం సచివాలయం నుండి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది,  రాష్ట్ర సీఎం కార్యదర్శి సాల్మాన్ ఆరోక్యరాజ్ లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, జేసిలతో సమీక్షించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, వినియోగదారులకు ఎలాంటి కొరత లేకుండా ఆయా జిల్లాల్లో ఇసుక నిల్వలను పెంచుకునేందుకు కలెక్టర్లు, సంబంధిత జేసీలు చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇసుక బుకింగ్ శాతం పెంచాల్సి ఉందని,ప్రజా అవసరాలకు ఎలాంటి కొరత లేకుండా ఇసుక నిల్వలను పెంచుకోవాలన్నారు.  అందుబాటులో ఉన్న ఇసుక రీచులతోపాటు అవకాశం ఉన్న చోట్ల కొత్త ఇసుక రీచులను గుర్తించి స్టాకు పాయింట్లలో ఇసుక నిల్వలను పెంచాలన్నారు. భూగర్భ జల శాఖ అధికారులు సమన్వయంతో, రీ సర్వేలు నిర్వహించి అనుకూలమైన చోట్ల కొత్త రీచులను గుర్తించి అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపాలన్నారు. ప్రభుత్వ నిర్మాణాల కట్టడాలకు, ప్రభుత్వం చేపట్టబోయే గృహ నిర్మాణాలకు భారీ స్థాయిలో ఇసుక అవసరం అవుతుందని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇసుక నిల్వలను పెంచుకునేలా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.  డోర్ డెలివరీ నిర్వహణను నిరంతరాయంగా సాగించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా ఇసుక సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ఉన్న స్థానిక రీచ్ లను గుర్తించి ఇసుక డిపోలను నెలకొల్పాలన్నారు.  అనంతరం ఆయా జిల్లాలోని ఇసుక డిపోలలో స్టాకు వివరాలు, క్షేత్ర స్థాయిలో ఆపరేషన్ లో ఉన్న ఇసుక రీచుల పరిస్థితిపై కలెక్టర్లతో సమీక్షించారు.       తనకల్లు తహసీల్దార్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అక్టోబర్ మాసంలో కురిసిన భారీ వర్షాలు, ఇటీవల నివార్ తుఫాను ప్రభావంతో నదీ పరివాహ ప్రాంతాల్లో  నీరు చేరడంతో.జిల్లాలోని 130 థర్డ్ ఆర్డర్ ఇసుక రీచుల్లో నీరు చేరిందన్నారు. తద్వారా  ఇసుక నిల్వలను పెంచుకోలేకపోవడం జరిగిందన్నారు.  వినియోగదారుల అవసరాలకు సరిపడా ఇసుకను అందించడంపై దృష్టి సారించామన్నారు. ప్రభుత్వ భవన నిర్మాణాలకు ఇసుకను అందుబాటులో ఉంచామన్నారు.  కొత్తగా11 ఇసుక రీచ్ లను గుర్తించామని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపడం జరుగుతుందని వివరించారు.ఇసుక రీచులు నీటితో నిండి ఉండటంతో ప్రస్తుతం ఇసుక నిల్వల కొరత ఏర్పడిందన్నారు. కొన్ని ప్రాంతాల్లో డ్రెడ్జింగ్ చేస్తున్నామన్నారు. వీలయినంత త్వరలో ఇసుక నిల్వలను పెంచి ప్రజల అవసరాలకు సరిపడా డిపోల్లో నిల్వలను పెంచేందుకు చర్యలు చేపడుతామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కదిరి ఆర్డీఓ వెంకట శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.