పారదర్శకంగా బియ్యం కార్డులు..


Ens Balu
1
Visakhapatnam
2020-12-16 22:50:13

విశాఖ జిల్లాలో 12 లక్షల బియ్యం కార్డులను పారదర్శకంగా  పంపిణీ చేయడం జరిగిరిదని సంయుక్త కలెక్టరు ఎం.వేణుగోపాలరెడ్డి తెలిపారు.  బుధవారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ  ప్రభుత్వ ఆదేశముల ననుసరించి రేషన్ కార్డులలోని యూనిట్లను ఆధార్ సంఖ్యతో అనుసంధానం చేయడం జరిగిందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకున్న పదిరోజులలోగా  బియ్యం కార్డు జారీ చేస్తున్నట్లు చెప్పారు.   జూన్ మాసం నుండి ఇప్పటి వరకు 36,509 మందికి కొత్త కార్డులు, 22,802 మందికి పాత కార్డు నుండి విభజించి కొత్త కార్డులు జారీ చేశామన్నారు. 1,27,987 మంది కుటుంబ సభ్యులను కొత్తగా చేర్చగా 382 మందిని తొలగించామని చెప్పారు.  సరకు లేక పోవడం, నాసిరకం సరకు, అధికరేట్లు, తూకంలో తేడాలు, అక్రమరవాణాల పై వచ్చిన ఫిర్యాదుల పై చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.  పౌర సరఫరాల అధికారి కె.శివప్రసాద్ నివేదికను సమర్పిస్తూ గత సమావేశంలో సభ్యులు లేవనెత్తిన అంశాలపై తీసుకున్న చర్యలను చదివి వినిపించారు. బహిరంగ మార్కెట్ లో నిత్యావసరాల లభ్యత, ప్రజాపంపిణీ వ్యవస్థ, నిత్యావసర సరుకుల రవాణా, రేషన్ షాపుల వివరాలు తదితర వివరాలను తెలియజేశారు. కమిటీ సభ్యులు, జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షులు  కె.వెంకటరమణ మాట్లాడుతూ నిల్వ వుండిపోయిన కిరోసిన్ పై తగిన చర్యలు తీసుకోవాలని, కొన్ని చోట్ల సరుకును డబ్బాల ద్వారా కొలిచి ఇస్తున్నారని, తూనిక ద్వారానే ఇచ్చేట్టు, తూనికలు కొలతల శాఖ తనిఖీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.   వినియోగదారుల సంక్షేమ సంఘాల భవన నిర్మాణానికి నిధులు మంజూరై వున్నందున స్థలాల కేటాయింపుకు చర్యలు తీసుకోవలసినదిగా అభ్యర్ధించారు. సభ్యులు మాట్లాడుతూ రైతు బజార్లలో పారిశుధ్యం మెరుగు పరచాలని, ధరల పట్టికలను ఉదయాన్నే సరిచేయించాలని కోరారు. ఏజెన్సీలోరోడ్లపై దుకాణాలను తీయించాలని, కల్తీని అరికట్టేందుకు తరచూ తనిఖీలు నిర్వహించాలని, కేసులు పెట్టాలని, రేషన్ షాపులకు మంగళవారం శలవు పునరుద్దరించాలని, వినియోగ దారుల క్లబ్బులను చైతన్యవంతం చేయాలని,  వినియోగ దారుల హక్కులు, పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తగిన చర్యలు చేపట్టాలని కోరారు.   సభ్యుల సలహాలపై చర్యలు చేపట్టడం జరుగుతుందని జె.సి. చెప్పారు.  ఈ సమావేశంలో జిల్లా పౌర సంఫరాల అధికారి (సిటీ) నిర్మలాబాయి, పౌర సరఫరాల సంస్థ డివిజనల్ మేనేజరు వెంకటరమణ,  కమిటీ సభ్యులు జగదీశ్వరరావు, రామారావు, కె.శ్రీనివాసరావు, ఆర్.సత్యనారాయణ, సంతోష్ కుమార్, ఎస్.చిట్టిబాబు  తదితరులు పాల్గొన్నారు.