అర్హులైన పేదలందరికీ పక్కా ఇళ్లు..
Ens Balu
6
East Godavari
2020-12-16 23:19:14
తూర్పుగోదావరి జిల్లాలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ళ స్ధలాల కొరకు సిధ్ధం చేసిన లేఅవుట్లలో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీత తెలిపారు. బుధవారం కాకినాడ కుళాయి చెరువు వద్దనున్న కాకినాడ స్మార్ట్ సిటీ సమావేశ మందిరంలో లబ్దిదారులకు ప్లాట్స్ కేటాయింపుకు సంబంధించి లాటరీ నిర్వహణకు కాకినాడ ఎం.పి. వంగా గీత, సిటీ శాసన సభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి తో కలిసి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంగా గీత మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగ ఇళ్ళ స్ధలాల కొరకు ప్రభుత్వ భూములే కాకుండా ప్రైయివేటు భూములు సైతం కొనుగోలు చేసి పేదలందరికీ ఇళ్ళ పట్టాలు ఇస్తున్నారన్నారు. రాష్ట్రం మొత్తం మీద పేదలందరికీ ఇళ్ళ స్ధలాల పధకానికి సంబంధించి సుమారుగా 30 లక్షల మందికి ఇళ్ళ స్ధలాల పంపిణీ కార్యక్రమాన్ని కాకినాడ లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించడం శుభపరిణామమని ఆమె తెలిపారు. కాకినాడ పట్టణ వాసులకు కొమరగిరిలో సిధ్దం చేసిన లేఅవుట్ రాష్ట్రంలోనే పెద్ద లేఅవుట్ అని అన్నారు.
గతంలో లబ్దిదారులకు ఇచ్చే ఇళ్ళ స్ధలాలు ఏ భూమి ఎక్కడ ఉందో వివరాలు ఉండేవి కాదని, కానీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అన్ని లేఅవుట్లు పూర్తి మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. ప్రభుత్వం ఇళ్ళ పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇళ్ళు నిర్మించేంత వరకు పేదలందరికీ ప్రభుత్వం అండగా వుంటుందని ఎంపి తెలిపారు.
సిటీ శాసన సభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కాకినాడ పట్టణ వాసులకు త్వరలోనే స్వంత ఇంటి కల నెరవేరుతుందన్నారు. పేదల ఇళ్ళ స్ధలాల కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వేల కోట్ల రూపాయలు వెచ్చించి లేఅవుట్లను సిధ్ధం చేయడం జరిగిందన్నారు. కాకినాడ పట్టణ నియోజకవర్గానికి సంబంధించి సుమారుగా 650 ఎకరాల్లో 30,598 ఫ్లాట్స్ ను ఇళ్ళ స్ధలాల కొరకు లేఅవుట్స్ సిధ్ధం చేయడం జరిగిందన్నారు. పట్టణ వాసులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రోడ్లు, విద్యుత్, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, త్రాగు నీరు, తదితర సౌకర్యాలు అందుబాటులో ఉండేవిధంగా లేఅవుట్స్ సిధ్ధం చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే సిధ్ధం చేసిన లేఅవుట్స్ వద్దకు మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో బస్సుల ద్వారా లబ్దిదారులను తీసుకువెళ్ళి తమకు కేటాయించిన ఇళ్ళ స్ధలాలను చూపించడం జరిగిందన్నారు. జాబితాలో లబ్దిదారులు ఎవరైనా తప్పిపోయిన దరఖాస్తు చేసుకుంటే వారి అర్హతలను బట్టి 3 నెలల్లోనే ఇళ్ళ పట్టా ఇవ్వడం జరుగుతుందని ఎంఎల్ఏ తెలిపారు.
నగర పాలక సంస్ధ కమీషనర్ స్వప్నిల్ దిన్కర్ పుడ్కర్ మాట్లాడుతూ లబ్దిదారుల ప్లాట్లు కేటాయింపుకు సంబంధించి ఎటువంటి అవినీతికి తావులేకుండా అత్యంత పారదర్శకంగా లాటరీ నిర్వహించడం జరుగుతుందన్నారు. కంప్యూటరైజ్డ్ ర్యాండమ్ పధ్ధతిలో లబ్దిదారులకు ఫ్లాట్స్ ఎంపిక చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. కాకినాడ పట్టణవాసులకు సంబంధించి గతంలో కొమరగిరి లేఅవుట్ కు లాటరీ నిర్వహణ పూర్తి కాగా, ఈ రోజు చొల్లంగి, పటవల, జీ.వేమవరం, కోమరగిరి, అచ్చుతాపురత్రయం లలో సిధ్ధం చేసిన సుమారు 287 ఎకరాల విస్తీర్ణంలో 11,668 లబ్దిదారులకు ప్లాట్లును లాటరీ ద్వారా కేటాయించడం జరిగిందని కమీషనర్ తెలిపారు. అనంతరం ఎంపి, ఎంఎల్ఏ, కమీషనర్ చేతుల మీదుగా కంప్యూటరైజ్డ్ లాటరీ నిర్వహించారు.
ఈ సమావేశంలో అడిషనల్ కమీషనర్ సిహెచ్.నాగనర్శింహారావు, కార్పొరేటర్లు, ఇతర అధికారులు, లబ్దిదారులు తదిరులు పాల్గొన్నారు.