వాక్సిన్ పంపిణీ ఏర్పాట్లు పక్కాగా చేయాలి..
Ens Balu
4
Srikakulam
2020-12-17 20:23:38
శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ వాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కోవిడ్ వాక్సిన్ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం గురువారం జరిగింది. జిల్లా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ వాక్సిన్ ఇచ్చేవారికి సరైన శిక్షణ ఇవ్వాలన్నారు. వాక్సినేషన్ పాయింట్ లను పక్కాగా గుర్తించాలని ఆయన స్పష్టం చేసారు. వాక్సిన్ బాక్సులను పిహెచ్సిల నుండి గ్రామ సచివాలయం వరకు రవాణా చేయాలని, అందుకు తగిన రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు. వాక్సిన్ మొదటి ప్రాధాన్యత హెల్త్ కేర్ వర్కర్లకు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో 20 వేల మంది ఉంటారని అంచనా ఉందని చెప్పారు. రెండవ దశలో ఫ్రంట్ లైన్ వర్కర్లుగా ఉన్న పోలీసు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర ప్రభావిత వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో 15 వేల మంది ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. 50 సంవత్సరాలలోపు వయస్సు కలిగి ఇతర రుగ్మతలతో ఉన్నవారు, 50 సంవత్సరాల వయస్సు పైబడిన వారిని మూడవ దశలో తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
జిల్లాలో 30 శాతం జనాభా, 5 లక్షల వరకు ఉంటారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఆయా వర్గాల డేటా బేస్ పక్కాగా ఉండాలని ఆయన ఆదేశించారు. జాబితాలో పేరు ఉన్నవారికి మాత్రమే వాక్సిన్ వేయడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేసారు. ఎన్నికల పోలింగ్ నిర్వహించిన విధంగా పకడ్బందీగా వాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. జాబితాలోకి అనవసరపు పేర్లు ఉంటే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
మూడవ గ్రామ స్థాయిలో వాక్సిన్ ఇచ్చే ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. వాక్సిన్ పంపిణీ సమయంలో విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా ఉండాలని, ఇపిడిసిఎల్ ఎస్ఇ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి వాక్సిన్ పాయింట్ వద్ద వేచి ఉండే గది, అబ్జర్వేషన్ రూమ్ ఉండాలని అక్కడ విధిగా ఒక ఆశా కార్యకర్త ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. వాక్సిన్ దుష్ప్రభావాలు చూపిస్తే అందుకు తగిన చికిత్స అందించుటకు అవసరమైన వైద్యులతో ఒక కేంద్రం అందుబాటులో ఉండాలని సూచించారు. ఏరియా ఆసుపత్రిలో 10 బెడ్లు, బోధన ఆసుపత్రిలో 20 బెడ్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అవసరమైన అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలని,ఐస్ బాక్స్ లు సరిపడినంత ఉండాలని, అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు. స్వయం సహాయక బృందాలు, అంగన్వాడి, తదితర వర్గాల సేవలను వినియోగించుకోవాలని అన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, సహాయ కలెక్టర్ ఎం.నవీన్, డిఎంహెచ్ఓ కె.సి.నాయక్, ఏఎస్పీ పి.సోమశేఖర్, డిఎస్పీలు సి.హెచ్.జి.వి.కె.ప్రసాద్, మహేంద్ర, ఆరోగ్య శాఖ అధికారులు డా.బి.జగన్నాథ రావు, డా. కె.అప్పారావు, డా. ఎన్. అనురాధ, డా.ఎల్. భారతి కుమారి దేవి, డా. కృష్ణ మోహన్, జిజిహెచ్ సూపరింటెండెంట్ డా.ఏ.కృష్ణమూర్తి, ఆర్ఎంఓ డా.ఆర్.అరవింద్, డిసిహెచ్ఎస్ డా.బి.సూర్యారావు, డిటిసి డా.వడ్డి సుందర్, ఎమ్. హెచ్.ఓ డా.ఎం.వెంకట రావు, డిఎంఓ జి.వీర్రాజు, డిఆర్డిఏ పిడి బి.శాంతి శ్రీ, ఇపిడిసిఎల్ ఎస్ఇ ఎన్. రమేష్ తదితరులు పాల్గొన్నారు.