కోవిడ్ వేక్సినేషన్‌కు పటిష్ట ప్రణాళిక..
Ens Balu
2
Vizianagaram
2020-12-17 21:51:19
కోవిడ్-19 వేక్సినేషన్ పంపిణీకి పటిష్టమైన ప్రణాళికను రూపొందించాలని కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ ఆదేశించారు. కోవిడ్ వేక్సినేషన్ టాస్క్‌ఫోర్సు కమిటీ సమావేశం గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగింది. జిల్లాలో వేక్సినేషన్ సన్నద్దతపై ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ హరి జవహర్‌లాల్ మాట్లాడుతూ తొలివిడతలో 14,278 మంది వైద్యారోగ్య సిబ్బందికి వేక్సిన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. రెండో దశలో పోలీసులు, మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది, హోంగార్డులు తదితర ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కు, 50ఏళ్లు పైబడినవారికి, వివిధ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వేక్సినేషన్ జరుగుతుందన్నారు. అత్యంత కీలకమైన మూడో దశలో సామాన్య ప్రజలకు వేక్సిన్ ఇవ్వడం జరుగుతుందని, దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. తొలివిడత వేక్సిన్ వేసేందుకు ముందుగా అన్ని వసతులు కలిగిన పిహెచ్‌సిలను ఎంపిక చేయాలని సూచించారు. ఈ కేంద్రాల్లో వెయిటింగ్ హాలు, వేక్సినేషన్ రూము, అబ్జర్వేషన్ రూములు ఉండాలన్నారు. ఈ కేంద్రాలకు నిరంతర విద్యుత్ సరఫరా, అత్యవసర సేవలకు అనుగుణంగా రహదారి సౌకర్యం కూడా ఉండాలని స్పష్టం చేశారు. అవసరమైన సిబ్బందిని గుర్తించి, వారి ఉద్యోగ స్థాయికి అనుగుణంగా విధులను కేటాయించి, శిక్షణ ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా వేక్సినేషన్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు గాను ట్రాన్స్‌పోర్టేషన్, అవేర్‌నెస్, రిస్క్‌మేనేజ్‌మెంట్ కమిటీలను వేసి, వారికి కూడా అవసరమైన శిక్షణ ఇవ్వాలని అన్నారు. ఈ ప్రక్రియను 24 గంటలూ పర్యవేక్షించే యంత్రాంగాన్నికూడా ఏర్పాటు చేయాలన్నారు. శిక్షణకోసం ఒక కేలండర్‌ను రూపొందించుకోవాలని, అలాగే ఎప్పటికప్పుడు మీడియాకు సమాచారాన్ని కూడా అందజేయాలని కలెక్టర్ సూచించారు.
జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ ఎస్‌వి రమణకుమారి మాట్లాడుతూ వేక్సినేషన్ కోసం ఈ నెల 15 నుంచి 24 వరకూ వివిధ స్థాయిల్లో శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. ఎటువంటి పొరపాట్లు చోటు చేసుకోకుండా, అన్ని రకాల జాగ్రత్తలతో, అందరి సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖలూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వేక్సినేషన్ కార్యాచరణను యుఎన్‌డిపి ప్రాజెక్ట్ ఆఫీసర్ కమలాకర్ పవర్ పాయింట్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్(అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్‌కుమార్, డిఆర్ఓ ఎం.గణపతిరావు, యునెసెఫ్ కన్సల్టెంట్ శుభకిషోర్, డబ్ల్యూహెచ్ఓ కన్సల్టెంట్ డాక్టర్ భవానీ, వైద్యారోగ్యశాఖతోపాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.