30న విజయనగరం జిల్లాలో సీఎం పర్యటన..
Ens Balu
2
Vizianagaram
2020-12-18 21:48:21
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి ఈ నెల 30న విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆరోజు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేసి, ఇంటి నిర్మాణాలను ప్రారంభించనున్నారు. దీంతో జిల్లా యంత్రాంగం ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ప్రారంభించింది. దీనిలో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్, ఎస్‌పి బి.రాజకుమారి, జాయింట్ కలెక్టర్లు డాక్టర్ జిసి కిశోర్ కుమార్, డాక్టర్ ఆర్.మహేష్ కుమార్, ఇతర అధికారులు శుక్రవారం సాయంత్రం గుంకలాం లేఅవుట్‌ను ముఖ్యమంత్రి పర్యటన కోసం పరిశీలించారు. ఏర్పాట్లపై చర్చించారు. ఇళ్ల పట్టాల పంపిణీకి గుర్తుగా ఏర్పాటు చేయనున్న పైలాన్, హెలీపేడ్, సభ కోసం స్థలాలను ప్రాధమికంగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సభ కోసం భారీగా తరలివచ్చే ప్రజల రాకపోకలకు, అదేవిధంగా ముఖ్య అతిధులకోసం వేర్వేరుగా మార్గాలను గుర్తించాలని సూచించారు. సభా స్థలాన్ని పూర్తిగా చదును చేయాలన్నారు. లేఅవుట్ వద్ద ఉన్న చెరువును సుందరంగా తీర్చిదిద్దే పనులను తక్షణమే ప్రారంభించాలన్నారు. చెరువుకు సమీపంలో పైలాన్‌ను నిర్మించాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు, ఇప్పటినుంచే ప్రణాళికాబద్దంగా, పటిష్టంగా ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఓ బిహెచ్ భవానీశంకర్, హౌసింగ్ పిడి ఎస్‌వి రమణమూర్తి, డుమా పిడి ఏ.నాగేశ్వర్రావు, తాశీల్దార్ ప్రభాకరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.