స్మార్ట్ సిటీ పనులు సత్వరమే పూర్తిచేయాలి..


Ens Balu
2
Visakhapatnam
2020-12-18 22:28:35

స్మార్ట్ సిటీ అభివ్రుద్ధి పనులు నిర్ధేశించిన సమయానికి పూర్తిచేయాలని జివిఎంసీ కమిషనర్ డా.జి.స్రిజన అధికారులను ఆదేశించారు. శుక్రవారం రెండవ జోన్ పరిధిలో 18వ వార్డు పాండురంగా పురం ప్రాంతంలోని స్మార్ట్ సిటీ పధకం కింద మంజూరైన రోడ్లు ఆధునీకరణలో భాగంగా ఆ ప్రాంతాలలో జరుగుచున్న ఫుట్ పాత్ ఏర్పాటు పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంలో పాండురంగాపురం పరిసర ప్రాంతంనకు సంబందించి రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోషియేషన్ ప్రతినిధులు ఫుట్ పాత్ నిర్మాణ విషయమై ఇచ్చిన పలు సూచనలను పరిశీలించి తగు చర్యలు చేపట్టమని స్మార్ట్ సిటీ కార్యనిర్వాహక ఇంజినీరు సుధాకర్ ను ఆదేశించారు. డిశంబర్ నెల ఆఖరు నాటికి పనులు పూర్తీ అవ్వాలని సూచించారు. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోషియేషన్ ప్రతినిధులు పాండురంగాపురం ప్రాంతాలలో నీటిసరఫరా గత కొద్ది రోజులనుండి సరిగా జరగడం లేదని చెప్పగా, రెండు రోజులలో సమస్యను పరిష్కరించాలని నీటి సరఫరా విభాగపు అసిస్టెంట్ ఇంజినీరుని ఆదేశించారు.  ఆ ప్రాంతాలలో గల పెద్ద కాలువపై స్లాబ్ లు ఏర్పాటు చేయమని సభ్యులు కోరగా, వాటిని పరిసీలించి అంచనాలను తయారు చేయాలని రెండవ జోన్ కార్యనిర్వాహక ఇంజినీరుని ఆదేశించారు. పాండురంగాపురం ప్రాంతంలో గృహాల నుండి చెత్తను వేరుచేసి ఇవ్వమని, శానిటరీ సిబ్బంది ప్రజలకు చెప్పుచున్నది లేనిదీ అని సభ్యులను కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. సభ్యులు ఈ విషయంపై సంతృప్తి వ్యక్తపరిచారు. పాండురంగాపురంలో అభివృద్ధి చేసిన పార్కు అవసరాలకు శుద్ధి చేసిన భూగర్భ డ్రైనేజీ నీటిని సరఫరా చేయమని సభ్యులు కోరగా కమిషనర్ సానుకూలంగా స్పందించారు. బీచ్ లోనికి వెళ్ళడానికి పాండురంగాపురం రోడ్డు ఒక్కటే ప్రజలు వాడుచున్నందున ట్రాఫిక్ సమస్యతో స్థానికులు ఇబ్బంది పడుచున్నారని, ఆల్ ఇండియా రేడియో స్టేషన్ రోడ్డు నుండి బీచ్ రోడ్ నకు వేరొక మార్గాన్ని అభివృద్ధి చేయాలని సభ్యులు కమిషనరును కోరారు.  ఈ క్షేత్ర పరిశీలనలో రెండవ జోనల్ కమిషనర్ శ్రీనివాస్, ఏ.ఎం.ఓ.హెచ్. జయరాం, ఏ.సి.పి. భాస్కర బాబు, మెకానికల్ కార్యనిర్వాహక ఇంజినీరు చిరంజీవి, స్మార్ట్ సిటీ కార్యనిర్వాహక ఇంజినీరు సుధాకర్, రెండవ జోన్ కార్యనిర్వాహక ఇంజినీరు కె. శ్రీనివాస్, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు ఎం.శ్రీనివాస్, నీటి సరఫరా విభాగపు అసిస్టెంట్ ఇంజినీరు, శానిటరీ ఇన్స్ స్పెక్టర్, వార్డు కార్యదర్శులు,   రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోషియేషన్ ప్రతినిధులు తదితరులు  పాల్గొన్నారు.