జగనన్న తోడుకి సహకరించండి..
Ens Balu
2
Visakhapatnam
2020-12-18 23:00:08
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న తోడు పధకానికి సంబందించిన ఋణాలను త్వరితగతిన మంజూరు చేయాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన సంబందిత బ్యాంకు అధికారులను కోరారు. శుక్రవారం ఈ పధకం క్రింద ఋణాల మంజూరు ప్రగతిని స్వయంగా తెలుసుకొనే నిమిత్తం ఆమె, ఎల్.డి.ఎం.తో కలసి పెద్ద వాల్తేరు ఆంధ్రా బ్యాంకు, యూనియన్ బ్యాంకు బ్రాంచీలను సందర్శించారు. జగనన్న తోడు పధకం క్రింద ఈ రెండు బ్యాంకుల ఋణాల మంజూరును వాకబు చేయగా ఆంధ్రా బ్యాంకులో 353 టార్గెట్ నకు గాను 33 ఋణాలు మాత్రమే మంజూరు చేయగా, యూ.బి.ఐ. వారు 227 టార్గెట్ నకు గాను ఆరుగురికి మాత్రమే ఋణాలు మంజూరు చేయడం పై ఆశ్చర్యం వ్యక్తం చేసారు. సంబందిత బ్యాంకు ఉన్నతాధికారులతో మాట్లాడుతూ జగనన్న తోడు పధకంను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చిరు వ్యాపారులను ఆదుకొనే నిమిత్తం ఋణాలను మంజూరు చేయుటకు గాను రాష్ట్ర స్థాయిలో బ్యాంకర్ల సమావేశాలలో నిర్ణయం తీసుకోబడినదని, గానీ, దిగువ బ్రాంచి స్థాయిలో వీటి మంజూరుపై పురోగతి కనబడడం లేదని ఉన్నతాధికారులకు తెలిపారు. నిర్ణయించబడిన టార్గెట్లను రేపటిలోగా బ్రాంచి అధికారులు పూర్తీ చేసి ఋణాలను విడుదల చేసేలాగ క్రింద బ్రాంచి మేనేజర్లకు సూచించాలని తెలిపారు. బ్రాంచి అధికారులకు ఏమైనా సిబ్బంది సహకారం అవసరమైనచో, జివిఎంసి సిబ్బంది సహకారం అందిస్తారని బ్యాంకు మేనేజర్లకు సూచించారు.
ఈ బ్యాంకుల సందర్శనలలో, పి.డి.(యు.సి.డి.) వై. శ్రీనివాసరావు, లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీనాద్, రెండవ జోన్ ఏ.పి.డి. మస్తాన్ బేబి, డి.ఎం.సి. నాగరాజు, సచివాలయ వార్డు సంక్షేమ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.