రూ.4కోట్లతో మార్కెట్ సుందరీకరణ..
Ens Balu
3
Srikakulam
2020-12-18 22:35:26
శ్రీకాకుళంలో రూ. 4 కోట్లతో పొట్టి శ్రీరాములు మార్కెట్ సుందరీకరణ చేయడం జరిగిందని శాసన సభ్యులు మరియు మాజీ మంత్రి వర్యులు ధర్మాన ప్రసాద రావు పేర్కొన్నారు. శుక్రవారం స్ధానిక పొట్టి శ్రీరాములు మున్సిపల్ మార్కెట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎం.ఎల్.ఎ. మరియు మాజీ మంత్రివర్యులు ధర్మాన ప్రసాద రావు ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మార్కెట్ తో తనకు అవినాభావ సంబంధం వుందన్నారు. ఒక్కప్పటి మార్కెట్ దుస్థితి చూసి మార్కెట్ ను సుందరంగా తీర్చి దిద్దాలనే ఆలోచన కలిగిందని, ఆలోచన కార్యరూపం దాల్చడానికి అందరూ సహకారం అందించారని తెలిపారు. రూ. 4 కోట్లతో మార్కెట్ ను పునర్నిర్మించడం జరిగిందన్నారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ కమీషనరు, సిబ్బంది, ఇంజనీరింగ్ అధికారులు బాగా సహకరించారని తెలిపారు. ఈ నెలలోనే అందరికీ దుకాణాలను అప్పగించడం జరుగుతుందని తెలిపారు. హోల్ సేల్ మార్కెట్ నిర్మిస్తామన్నారు.
పట్టణంలో రహదారులు విస్తరణ కార్యక్రమం చేపడతామన్నారు. మెరుగైన పరిస్థితులకు నిజాయితీగా విధులను నిర్వహించాలని అధికారులకు సూచించారు. మార్కెట్ అనేది వ్యాపారులతో పాటు పౌరులందరిదీ అని, సుమారు రెండు లక్షల మంది కొనుగోలు నిమిత్తం మార్కెట్టుకు వస్తారని తెలిపారు. వారందరికీ మంచి పరిశుభ్రమైన వాతావరణంలో కొనుగోలు చేసే అవకాశం కలిగిందన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతున్నదని, అవినీతికి తావు లేని విధంగా పాలన అందించనున్నామని తెలిపారు. కార్పోరేషన్ నిధులు, కేంద్ర నిధులతో పట్టణాన్ని అభివృధ్ధి చేస్తామన్నారు. కళింగపట్నం బీచ్ ని విశాఖపట్నం బీచ్ మాదిరిగా అభివృధ్ధి చేయాలని, మంచి రోడ్లు నిర్మించి, ఫుడ్ కోర్టులు, హోటల్స్ ఏర్పాటు చేసి మంచి పర్యాటకంగా అభివృధ్ధి చేయాల్సిన అవసరం వుందన్నారు. జిల్లా ప్రజలకు సర్వాంగ సుందరమైన శ్రీకాకుళాన్ని అందించాలన్నారు.
ఇందుకు ప్రతీ ఒక్కరు సహకరించాలని తెలిపారు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఎం.వి.పద్మావతి మాట్లాడుతూ, మార్కెట్ లో వున్న ఇబ్బందులను తెలుసుకుని మన శాసన సభ్యులు మార్కెట్ ను పునర్నిర్మాణం చేయడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ వారి సహకారంతో మార్కెట్ ప్రారంభించడం జరిగిందని అన్నారు. రెండు రోజులలో షాపులను అప్పగించడం జరుగుతుందని సంతోషంగా, స్వేఛ్ఛగాను వ్యాపారాలు చేసుకోవాలని అన్నారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది అందించిన విధంగానే వ్యాపారస్తులు పరిశుభ్రత పాటించాలన్నారు. నగరపాలక సంస్థ కమీషనరు పి.నల్లనయ్య మాట్లాడుతూ, మార్కెట్ పునరుధ్ధరణకు తమ సిబ్బంది చాలా కృషి చేసారని తెలిపారు. అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన మార్కెట్ లో అంతే పరిశుభ్రతను పాటించాలన్నారు. ప్రతీ దుకాణం వద్ద డస్ట్ బిన్ లు పెట్టుకోవాలన్నారు. రోజుకు మూడు సార్లు చెత్తడంపింగ్ కు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం ఎం.ఎల్.ఎ. ధర్మాన ప్రసాదరావును గజమాలతో సన్మానం చేసారు.
ఈ కార్యక్రమానికి నగరపాలక సిబ్బంది సత్యన్నారాయణ, వెంకట రావు, దక్షిణామూర్తి, సానిటరీ విభాగపు గణేష్, మాజీ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ చల్లా అలివేలు మంగ, చల్లా శ్రీనివాస రావు, కోణార్క్ శ్రీను, అంధవరపు రామ, డా. పైడి మహేశ్వర రావు, అంధవరపు సంతోష్, మండవిల్లి రవి, మత్స్యకార కార్పోరేషన్ డైరక్టర్ మహాలక్ష్మి, పి.రుషి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎం.కేశవ రావు, అర్జున్, ముకుంద్, అంధవరపు రఘు, మెంటాడ స్వరూప్ తదితరులు హాజరైనారు.