విద్యుత్ తక్కువ వినియోగంలో 2వ స్థానం..
Ens Balu
3
Machilipatnam
2020-12-18 23:19:57
ప్రకృతి వనరుల వినియోగం, విద్యుచ్ఛక్తి వినియోగంలో పొదుపు ఆవశ్యకత ఎంతో కీలకమని , విద్యుత్ వినియోగం తగ్గించడంలో కృషి చేసినందుకు ఈ ఏడాది స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ అఫీషియల్ అవార్డుల బహుకరణలో మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్ కు రెండవ స్థానమైన సిల్వర్ అవార్డుకు ఎంపికవ్వడం ఎంతో అభినందనీయమని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) హర్షం ప్రకటించారు. శుక్రవారం ఉదయం ఆయన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంకు హాజరయ్యేందుకు తాడేపల్లి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆ హడావిడి సమయంలో సైతం తన కార్యాలయం వద్ద వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలిసి వారి ఇబ్బందులను గూర్చి స్వయంగా అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని నాని తక్షణ పరిష్కారం సూచించారు. తొలుత మచిలీపట్నం మునిసిపల్ కమీషనర్ శివరామకృష్ణ , ఎలక్ట్రికల్ డి ఇ సాయి ప్రసాద్ తదితర అధికారులు మంత్రి పేర్ని నానిను కలిశారు. స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ సిల్వర్ అవార్డు మచిలీపట్నం కార్పొరేషన్ దక్కిందని ఆ మేరకు వచ్చిన అధికార పత్రాన్ని మంత్రికి చూపించారు. మన రాష్ట్రంలోని 120 మునిసిపాలిటీలలో మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్ కు రెండవ స్థానం దక్కడం ఎంతో గర్వకారణమని మంత్రి పేర్ని నాని అధికారులను అభినందించారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కు ప్రధమ స్థానం ( గోల్డ్ అవార్డు ) పొందిందని కమీషనర్ మంత్రికి తెలిపారు. సిమెంట్ ఫ్యాక్టరీలు ,థర్మల్ పవర్ ప్లాంట్లు, అర్బన్ లోకల్ బాడీస్ ఈ మూడు విభాగాలలో ఈ పురస్కారాలు ఇస్తున్నట్లు కమీషనర్ మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యుచ్ఛక్తిని దుర్వినియోగం చేయడమంటే సమాజానికి , భవిష్యత్తు తరాలకు తీరని ద్రోహం చేసినట్లేనని, రాష్ట్రంలోనే విద్యుత్ పొదుపుగా వినియోగించుకున్న స్మార్ట్ సిటీ తిరుపతికు గోల్డ్ అవార్డు దక్కడం , ఆ తర్వాత స్థానం మన మచిలీపట్నం కార్పోరేషన్ కు సిల్వర్ అవార్డు చేజిక్కించుకోవడం ఎంతో సంతోషమన్నారు. గతంలో సంప్రదాయ ఫిలమెంట్ బల్బుల వాడకం వల్ల ఎక్కువగా విద్యుత్ ఖర్చు అవుతుండేదని దీనివల్ల వెలుగుకు అయ్యే ఖర్చుకన్నా ఆ బల్బు వేడెక్కడానికే ఎక్కువ వినియోగమవుతుందని అందుకే ఫ్లోరోసెంట్, ఎల్‌ఇడి బల్బుల వాడకం మన కార్పొరేషన్లలో మొదలైందని తెలిపారు. ఇళ్లలో వాడే విద్యుచ్ఛక్తి వినియోగంలో అత్యధికులు ఎయిర్ కండిషనింగ్ కే 40 శాతం ఖర్చుపెడుతున్నారని అన్నారు. .మనదేశంలో విద్యుచ్ఛక్తి పొదుపుగా వాడే విషయాన్ని ఉద్యమంగా చేపట్టే బాధ్యత ప్రజలందరూ స్వీకరించాలని మంత్రి పేర్ని నాని సూచించారు.
అనంతరం పలువురు ఉపాధ్యా నేతలు మంత్రిని కలిశారు. ఎస్జీటీ ఉపాధ్యాయ బదిలీలను మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా నిర్వహించాలని, పోస్టుల బ్లాకింగ్ ఎత్తివేయాలని తదితర సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) జీ.వి. నారాయణరెడ్డి, కె. నరహరి, తోట రఘుకాంత్ ( చిన్నా ), తదితరులు మంత్రి పేర్ని నానికు ఒక విజ్ఞాపనపత్రాన్ని అందచేశారు. మాధ్యమం మార్పు వలన పోస్టులు కోల్పోయిన పాఠశాలలకు పోస్టులను పునరుద్దరించాలని, రాష్ట్ర ఫ్యాప్టో చైర్మన్ జీ.వి. నారాయణరెడ్డి, కార్యదర్శి కె. నరహరి లకు జారీ చేసిన ఆర్టికల్ అఫ్ చార్జెస్ లను వెంటనే ఉపసంహరించుకోవాలని , బదిలీల్లో అన్ని స్థానాలను చూపించాలని, స్టేషన్ సీనియారిటీకి ఎనిమిదేళ్ల సీలింగ్ సరికాదని, మొత్తం సీనియారిటీని పరిగణనలోనికి తీసుకుని సర్వీస్ పాయింట్లు కేటాయించాలని కోరారు.
స్థానిక లక్షణారావు పురానికి చెందిన తన్నేరు సుధారాణి మంత్రి పేర్ని నానిను కలిసి తన కష్టాన్ని చెప్పుకొంది. ఇటీవలే తాను వార్డు హెల్త్ సెక్రటరీ పోస్ట్ కు ఎంపికయ్యానని తనకు పోస్టింగ్ విజయవాడలో ఇచ్చారని , తనకు ఒక చిన్న పాప ఉందని తన తండ్రి హార్ట్ పేషంట్ అని తనకు మచిలీపట్నంలో అదే ఉద్యోగం దయచేసి ఇప్పించాలని అభ్యర్ధించింది.
ఆంధ్రప్రదేశ్ వెటర్నరీ స్టూడెంట్స్ అండ్ గ్రాడ్యూయెట్ అసోసియేషన్ సభ్యులు పలువురు మంత్రి పేర్ని నానిని కలుసుకున్నారు. ప్రభుత్వం 824 పోస్టులకు జాబ్ క్రియేషన్ అఫ్ పోస్ట్స్ ఫైల్ పెట్టారని ఆర్ధిక శాఖ వద్ద నుంచి క్లియరెన్స్ వచ్చేలా సహాయం చేయాలనీ కోరారు.