ఇళ్ల పంపిణీకి ఏర్పాట్లు పక్కాగా ఉండాలి..
Ens Balu
2
విశాఖపట్నం
2020-12-19 18:31:22
జివిఎంసీ పరిధిలో పేదలకు ఇచ్చే ఇళ్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖామాత్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు(అవంతి) అధికారులను ఆదేశించారు. శనివారం జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన తో కలసి జివిఎంసి సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నగర పరిధిలో టిడ్కో గృహాలు, ఎల్.పి.సి.ల పంపిణీ స్థలాలు కేటాయించబోయే లబ్దిదారులకు లేఖలు పంపిణీకు సంబందించిన అన్ని చర్యలు చేపట్టమని తెలిపారు. ఈ నెల 25వ తేదీ నుంచి ప్రభుత్వ ఇళ్ల పట్టాలు పంపిణీ జరగాలన్నారు. టిడ్కో గృహాలుకు లాటరీ పద్దతి ద్వారా లబ్దిదారులను ఎంపిక చేసి డాక్యుమెంటు కార్యక్రమాలు పూర్తిచేసి రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు చేపడతామన్నారు. ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నియోజకవర్గం వారీగా చేపట్టాలని మంత్రి సూచించగా, ఈ నెల 27వ తేది నుండి వచ్చే నెల 5వ తేది వరకు కేటాయించిన తేదిలలో నగరపరిధిలో అన్ని నియోజిక వర్గాల వారీగా లబ్దిదారులకు కేటాయింపు ఉత్తర్వులు అందించేందుకు జోనల్ కమిషనర్ల ద్వారా తగు చర్యలు తీసుకుంటామని కమిషనర్ బదులిచ్చారు.
టిడ్కో గృహాల నిమిత్తం లబ్ది దారులు ఇదివరకే అధిక మొత్తంలో చెల్లించిన లబ్దిదారుల వాటా సొమ్మును తిరిగి వారికి చెల్లించడానికి తగుచర్యలు తీసుకోమని, ప్రభుత్వం ఇప్పుడు సూచించిన విధంగా లబ్దిదారుల వాటా మొత్తాన్ని వసూలు చేయాలని మంత్రివర్యులు కమిషనర్ కు సూచించారు. ఆయా జోనల్ వారిగా లబ్దిదారుల వివరాలను, ఇండ్ల కేటాయింపు వివరాలను జోనల్ కమిషనర్లను అడిగి తెలుసుకున్నారు. శనివారం సాయంత్రంలోగా లాటరీ నిర్వహించి టిడ్కో గృహాల కేటాయింపులను లబ్దిదారులకు చేపట్టాలని సంబందిత జాబితాలను ఆయా జోనల్ కమిషనర్లకు డాక్యుమెంటేషన్ మరియు తదుపరి చర్యల తీసుకొనే నిమిత్తం అందించాలని కమిషనర్ పి.డి. (యు.సి.డి.) వై. శ్రీనివాసరావును ఆదేశించారు.