2వ దశ కరోనాతో ప్రజలు జరభద్రం..
Ens Balu
3
Srikakulam
2020-12-19 18:42:40
శ్రీకాకుళం జిల్లాలో కరోనా రెండవ దశ వ్యాప్తి జరిగే అవకాశాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని వార్డు, గ్రామ సచివాలయాలు, అభివృద్ధి విభాగం జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు అన్నారు. వివిధ మత పెద్దలతో ప్రార్ధనా స్థలాల వద్ద చేపట్టవలసిన చర్యలపై శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశం జరిగింది. రాబోయే రెండు నెలల కాలంలో అత్యంత కీలకమని అన్నారు. ప్రార్ధనా మందిరాల్లో వ్యాప్తి కాకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. మత విశ్వాసాలు ముఖ్యమేనని, అదే సమయంలో ప్రాణాలు అతి ముఖ్యమని గుర్తించాలని ఆయన కోరారు. ప్రాణాలు ఉంటేనే మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టగలమని ఆయన అన్నారు. కరోనా వ్యాప్తి నివారణకు జిల్లా వాసులు బాగా సహకరించారని, రెండవ దశ ప్రబలకుండా మరింత సహకారాన్ని అందించాలని కోరారు. కొన్ని ఆలయాల్లో అధిక సంఖ్యలో భక్తులు హాజరు అవుతున్నారని అన్నారు. దానిని నివారించాలని ఆయన స్పష్టం చేసారు.
కరోనా మార్గదర్శకాలు విధిగా పాటించాలని, మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అన్నారు. శానిటైజర్లు ఉండాలని ఆయన స్పష్టం చేసారు. రెండవ దశ ఢిల్లీ వంటి ప్రాంతాల్లో తీవ్రంగా ఉన్న సంగతి గుర్తించాలని పిలుపునిచ్చారు. క్రిస్మస్, సంక్రాంతి తదితర పండగ సందర్భాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా వ్యాప్తి జిల్లాలో జరగకుండా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. త్వరలో వాక్సిన్ వస్తుందని, మొదటగా ఆరోగ్య సిబ్బందికి, తరువాత కరోనా ఫ్రంట్ లైన్ వర్కర్లు - పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులకు, అనంతరం 50 సంవత్సరాలు పైబడిన వారికి, ఇతర వ్యాధులతో బాధపడేవారికి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కరోనా వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు చేపడతామని మత పెద్దలు తెలిపారు. ఈ సమావేశంలో దేవదాయ శాఖ సహాయ కమీషనర్ వి.హరి సూర్య ప్రకాష్, 15 సూత్రాల కార్యక్రమం సభ్యులు మహిబుల్లా ఖాన్, ప్రభుత్వ ఖాజీ అబ్దుల్ వహాబ్, వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ షాహీద్ షేక్., మహమ్మద్ షానవాజ్, పి.కృపానందం తదితరులు పాల్గొన్నారు.