శ్రీకాకుళం జిల్లాను పరిశుభ్రంగా ఉంచాలి..
Ens Balu
1
Srikakulam
2020-12-19 18:48:55
శ్రీకాకుళం పరిశుభ్రమైన జిల్లాగా అవతరించాలని కలెక్టర్ జె.నివాస్ పిలుపునిచ్చారు. మనం - మన పరిశుభ్రతలో భాగంగా వ్యర్ధాలపై వ్యతిరేక పోరాటంపై జిల్లా పరిషత్ వద్ద శనివారం పాలకొండ శాసన సభ్యులు విశ్వాసరాయి కళావతితో కలసి జిల్లా కలెక్టర్ ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీ నుండి 21వ తేదీ వరకు కార్యక్రమం అమలు జరుగుతుందన్నారు. జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత (ఓడిఎఫ్ ఫ్రీ) జిల్లాగా ప్రకటించడం జరిగిందని అన్నారు. అయినప్పటికీ అనేక చోట్ల బహిరంగ మలవిసర్జన చేస్తున్నారని పేర్కొన్నారు. మలవిసర్జన సామాజిక దురాచారమని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో మెలగాలని, ప్రతి గ్రామం పరిశుభ్రమైన గ్రామంగా ఫరిడవిల్లాలని కోరారు. ప్రజలు సహాయ సహకారాలు అందించి స్వచ్చ శ్రీకాకుళం జిల్లాను ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన గ్రామాలలో కరోనా వంటి వైరస్ లతో సహా అన్ని రకాల వ్యాధులను పారద్రోలగలమని అన్నారు.
ప్రతి వాలంటీరు స్థాయిలో మలవిసర్జన జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించడం జరిగిందని అన్నారు. రెండు వందల ఇళ్ళకు ఒక గ్రామ సచివాలయ సిబ్బందిని పర్యవేక్షణకు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. మంచి ప్రణాళికలతో అమలు చేస్తున్నామని, మూడు నెలల్లో ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేసారు. వ్యర్ధాలపై వ్యతిరేక పోరాటంను మొదటి దశలో 76 పంచాయతీలలో చేపట్టామని అన్నారు. రెండవ దశలో 353 పంచాయతీలలో అమలు చేస్తున్నామని చెప్పారు. దీనిని సమర్థవంతంగా అమలు చేయుటకు ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి ఉందని నిర్ధారించుకోవాలని అన్నారు. కుటుంబ సభ్యులందరూ మరుగుదొడ్డిని ఉపయోగించేలా చైతన్య పరచాలన్నారు. స్నానానికి ఉపయోగించే నీరు, పాత్రలు శుభ్రపరచడం, బట్టలు ఉతకడం వంటి వ్యర్థ జలాలను మురుగు నీటి పారుదల వ్యవస్థ ద్వారా లేదా ఇంకుడు గుంటలకు మళ్ళించడం ద్వారా మురుగునీరు రోడ్ల పై ప్రవహించకుండా చూడాలని ఆయన కోరారు.
గ్రామంలో అన్ని విద్యా సంస్థలు, ఇతర సంస్థలు మరుగుదొడ్లు కలిగి ఉండి వాటిని విధిగా ఉపయోగించాలని పేర్కొన్నారు. శాసన సభ్యులు విశ్వాసరాయి కళావతి మాట్లాడుతూ ప్రజలలో చైతన్యం రావాలని అన్నారు. ఓడిఎఫ్, తడి చెత్త - పొడి చెత్త, కాలువలు నిర్వహణ, తాగునీరు కల్పన ప్రధానమైనదని అన్నారు. సచివాలయ సిబ్బంది ఉదయాన్నే గ్రామంలో సందర్శించడం అవసరమని అన్నారు. ఆహారం భుజించే ముందు, మలవిసర్జన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవడం అలవాటు చేయాలని ఆమె అన్నారు. గ్రామంలోని అన్ని గృహాలకు సురక్షిత త్రాగునీటి సరఫరా లభ్యత ఉండేలా చూడాలని కోరారు. ఇంటింటికి వెళ్ళి చెత్త సేకరణ, రవాణా, ఘన వ్యర్ధ పదార్ధాలను వేరుచేయడం, రీసైక్లింగ్, వర్మి కంపోస్ట్ ప్రాసెసింగ్ మొదలైనవి జరగాలని ఆమె అన్నారు. జిల్లాను ఆదర్శవంతంగా నిలబెట్టాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అర్దబ్ల్యూఎస్ ఎస్ఇ టి.శ్రీనివాసరావు, డిఆర్డీఏ పిడి బి.శాంతి శ్రీ తదితరులు పాల్గొన్నారు.