లోక్ అదాలత్ సేవలు వినియోగించుకోవాలి..


Ens Balu
5
Srikakulam
2020-12-19 18:59:21

శ్రీకాకుళం జిల్లాలో శాశ్వత లోక్ అదాలత్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని శాశ్వత లోక్ అదాలత్ ఇన్ ఛార్జ్ న్యాయమూర్తి మరియు జిల్లా ప్రధాన న్యాయ మూర్తి జి.రామకృష్ణ అన్నారు. శాశ్వత లోక్ అదాలత్ కోర్టులో ప్రజోపయోగ అంశాలకు సంబంధించిన వ్యాజ్యాలు పరిష్కరించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజోపయోగ సంబంధిత అంశాలైన బ్యాంకింగు, మునిసిపాల్ తదితర విభాగల అధికారులతో శని వారం శాశ్వత లోక్ అదాలత్ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రజోపయోగ సేవల వ్యాజ్యాల పరిష్కారానికి శాశ్వత లోక్ అదాలత్ లు ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో భాగంగా బ్యాంకింగు, ఆర్ధిక సంస్ధలు, పోస్టల్, టెలీగ్రాఫి, నీరు, విద్యుత్, పారిశుధ్యం, ఆసుపత్రుల సేవలు, బీమా సేవలు, జాతీయ ఉపాధి హామీ పథకం, విద్యా సంస్ధలు, రియల్ ఎస్టేట్ తదితర రంగాలకు చెందిన వ్యాజ్యాలను పరిష్కరించుకునే అవకాశం ఉందని ఆయన వివరించారు.  దేశంలోనే ప్రప్రధమంగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 2006 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన చెప్పారు. కోటి రూపాయల ఆస్తుల విలువ గల అంశాల వరకు శాశ్వత లోక్ అదాలత్ లో పరిష్కారానికి దరఖాస్తు చేసుకోవచ్చని రామకృష్ణ తెలిపారు. చట్ట ప్రకారం రాజీ చేయదగ్గ సేవలను శాశ్వత లోక్ అదాలత్ లో పరిష్కారం చేయవచ్చని ఆయన చెప్పారు. శాశ్వత లోక్ అదాలత్ లో ఫారం -3 లో పిర్యాధులను సమర్పించాలని ఆయన పేర్కొన్నారు. వ్యాజ్యం పరిష్కారం సమయంలో ఇరు పార్టీలు విధిగా హాజరు కావాలని ఆయన స్పష్టం చేసారు.           ఈ సమావేశంలో శాశ్వత లోక్ అదాలత్ సభ్యులు సగ్గు మధు రెడ్డి, రమేష్ చంద్ర సాహూ, ఎం.సి.హెచ్.అప్పల నాయుడు, జి.అప్పలనాయుడు, పి.చంద్రపతి రావు, పి.పాపారావు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.