దివీస్ ను ఆపేవరకూ పోరాటం ఆగదు..


Ens Balu
2
Kakinada
2020-12-19 20:07:25

తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలంలోనీ దివీస్ పరిశ్రమ నిర్మాణం పనులు నిలిపి వేయాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాకినాడలో స్థానిక సుందరయ్య భవన్ లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 17 వ తేదీన దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్యర్యంలో ఆందోళన చేస్తున్న రైతులు, వామపక్ష నాయకులు, 160 మంది ప్రజలపైన పోలీసులు పెట్టిన కేసులను ఎత్తివేయాలని 36 మందిపై నాన్ బెయిలబుల్ కేసులను నమోదు చేసి రిమాండ్ కు పంపారని, రైతుల న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న వారిపై పోలీసు యంత్రాంగం ఈ విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. గతంలో జగన్మోహనరెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు దివీస్ కి వ్యతిరేకంగా, రైతులకు అండగా ఉంటానని, దివీసను బంగాళాఖాతంలో కలిపేదాకా పోరాడతానని రైతులకు మాట ఇచ్చారని, కానీ నేడు దివీస్ యాజమాన్యానికి అండగా ఉంటూ దివీస్ ఫార్మా కంపెనీలో నిలిచి పోయిన నిర్మాణాలకు తానే అనుమతి ఇస్తూ, ముఖ్యమంత్రిగా తానే శంఖుస్థాపన చేయడానికి ప్రయత్నాలు చేయడాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయని అన్నారు.  తక్షణం ఈ కేసులను ఉపసంహరించు కోవాలని, నాయకులను, రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసారు. ఎం.ఎల్.సి. ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, మొన్నటి వరకు మాట తప్పని, మడమ తిప్పని ప్రభుత్వమని చెప్పే ముఖ్యమంత్రి మాట తప్పి రైతులను మోసం చేసారని అన్నారు. గత నెల రోజుల నుండి దివీస్ మాకొద్దు అని 14 గ్రామాలకు చెందిన ప్రజలు, రైతులు నిరాహార దీక్షలు చేస్తున్నారని, 17 వ తేదీన జరిగిన దివీస్ వ్యతిరేక పోరాటంలో వామపక్ష నాయకులు కె.ఎస్. శ్రీనివాస్ (సిపిఎం జిల్లా కార్యదర్శి), సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దువ్వ శేషబాబ్ది , మోర్త రాజశేఖర్, సిపిఐ (ఎం.ఎల్ ) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బుగతా బంగార్రాజు, నాయకులు జనార్ధన్ , సిపిఎం కార్యకర్త ఎం.సూరిబాబు, దివీస్ ప్రాంత రైతులు 33 మందిపై కేసులను పెట్టి నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించ డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా మన్నారు.  సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.వి.నాగేశ్వరరావు , సిపిఐ నాయకులు తోకల ప్రసాద్ , సిపిఐ ( ఎం.ఎల్ ) న్యూడెమోక్రసీ నాయకులు  జె.వెంకటేశ్వర్లు, పార్వర్డు బ్లాక్ నాయకులు ఎ.సూర్యనారాయణ, సిపిఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ నాయకులు పి.ఆదినారాయణ మాట్లాడుతూ ఈ భూములన్నీ సముద్ర తీరంలో ఉన్నాయని , ఈ ప్రాంతంలో సుమారు 15 నుండి 20 మత్స్యకార గ్రామాలు ఉన్నాయని , వేల కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. ఈ ప్రాంతంలో దివీస్ పరిశ్రమ వస్తే వాటి నుండి వచ్చే కాలుష్యం వల్ల మత్స్య సంపద నాశన మవుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం , జగన్మోహనరెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని , దివీస్ పనులను తక్షణం నిలుపుదల చేయాలని డిమాండ్ చేసారు. ఎన్ని నిర్భందాలెదురైనా దివీస్ ఉద్యమం ఆగదని , దివీస్ ప్రాంత ప్రజలకు వామపక్ష పార్టీలు నిరంతరం అండగా ఉంటాయని తెలిపారు . తక్షణం ఈ కేసులను ఉపసంహరించుకోవాలని , నాయకులను , రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసారు.  అనంతరం  ఎంఎల్.సి. వామపక్ష నాయకులు జిల్లా ఎస్.పి.ని కలిసి వినతిపత్రం సమర్పించారు. సిపిఎం జిల్లా నాయకులు జి.బేబీరాణి , కారెం వెంకటేశ్వర రావు , ఎం . వీరలక్ష్మి , కె.సింహాచలం, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె.వీరబాబు, తదితరులు పాల్గొన్నారు.