భూముల రీసర్వేపై ప్రజలకు అవగాహన కల్పించాలి..


Ens Balu
2
Anantapur
2020-12-19 20:58:06

వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం కింద జరుపుతున్న రీ సర్వే కార్యక్రమంపై ముందుగా గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు సర్వే వలన కలిగే లాభాలను గురించి అవగాహన కల్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్( రైతు భరోసా కేంద్రాలు, రెవెన్యూ )నిశాంత్ కుమార్ ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ లోని ఎన్ ఐ సి  వీడియో కాన్ఫరెన్స్  హాల్  ద్వారా డివిజన్ ,మండల స్థాయి అధికారులు ,మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న అన్ని లేఅవుట్లను పూర్తిస్థాయిలో సిద్ధం చేసి పట్టాల పంపిణీ కొరకు అన్ని చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని ఒక గ్రామం ఎంపిక చేసి అందులో రీ సర్వే పై గ్రామ సభ ద్వారా అవగాహన కల్పించడం జరిగిందన్నారు. మొదటి విడతగా చేపట్టిన 311 గ్రామాల్లో గ్రామ సర్వేయర్ , వాలం టీర్లు, విలేజి సర్వేయర్లు, మండల సర్వేయర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ , డిప్యూటీ తాసిల్దార్ , తాసిల్దారుల ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న రీ సర్వే పనులను రెండు రోజుల్లోగా పూర్తి  చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు 249 గ్రామాల్లో అవగాహన సదస్సులు పూర్తయ్యాయని మిగిలిన 62 గ్రామాలలో సోమవారం నాటికి సంబంధిత తాసిల్దార్ లు గ్రామ సభ లు పూర్తిచేయాలని తెలిపారు.  ముఖ్యంగా మొదటి విడతలో ఎంపికైన 311 గ్రామాల్లో "ఎఫ్"  లైన్ లో పట్టా సబ్ డివిజన్లు, స్పందన అర్జీ లు మరియు సీఎంఓ ఆర్జీలన్నివెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యవసాయ పొలాల్లో గట్లకు సున్నం వేయడం మరియు సర్వే రాళ్లకు వైట్ వాష్ చేయడం మరియు విలేజ్ సైట్లలో ప్రతి ఇంటికి సున్నం మార్క్ ను  పంచాయతీ సెక్రటరీ ద్వారా గుర్తించాల్సి ఉంటుందన్నారు. మున్సిపాలిటీలలో వార్డు ప్రణాళిక కార్యదర్శులు, విఆర్వోలు సున్నం మార్కులు ప్రతి ఇంటికి వేయాల్సి ఉంటుందన్నారు. మొదటి విడతలో ఎంపికచేసిన గ్రామాల్లో రెవెన్యూ రికార్డుల స్వచ్చీకరణను రెండు రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈనెల 21న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్ళపాడు గ్రామం లో రీ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని , మన జిల్లాలో ఈ నెల 22న పెనుకొండ డివిజన్ సోమందే పల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో ఈ కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు తెలిపారు. అందువల్ల రెవెన్యూ, సర్వే వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. రీ సర్వే కార్యక్రమంలో పోలీసు శాఖ కూడా భాగస్వామ్యం కావాల్సి ఉంటుందని జాయింట్ కలెక్టర్ తెలిపారు.  ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి గాయత్రీదేవి, ఓ ఎస్ డి ఆర్ కే ప్రసాద్ ,ఏడి సర్వే అండ్ ల్యాండ్ మచ్చింద్ర ,హౌసింగ్ పిడి వెంకటేశ్వర రెడ్డి, జడ్పీ సీఈవో శోభ స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు.