పండుగ వాతావరణంలో ఇళ్ల పట్టాల పంపిణీ..
Ens Balu
3
Vizianagaram
2020-12-19 21:50:36
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఖరారైన దృష్ట్యా ఆయా శాఖల జిల్లా అధికారులంతా తమకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించి పండగ వాతావారణంలో సి.ఎం. కార్యక్రమం జరిగేలా ఇప్పటి నుండే అవసరమైన ఏర్పాట్లను ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ ఆదేశించారు. జిల్లాలోని విజయనగరం రూరల్ మండలం గుంకలాం వద్ద పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి ఈనెల 30న వస్తున్న నేపథ్యంలో జిల్లాకు చెందిన సీనియర్ అధికారులతో కలెక్టర్ శనివారం సమావేశమయ్యారు. పర్యటన ఏర్పాట్లకు తగినంత సమయం వున్నందున ఇప్పటినుండే సిద్ధం కావాలన్నారు. ముఖ్యమంత్రి కార్యక్రమం నిర్వహించే వేదిక ప్రాంతాన్ని చదును చేయడం, ముళ్ల పొదలను తొలగించడం, సర్వే రాళ్లు వేయించడం తదితర పనులు పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్(రెవిన్యూ) డా.కిషోర్ కుమార్ కు సూచించారు. కొందరు సమర్ధులైన రెవిన్యూ ఉద్యోగులను గుర్తించి బ్లాకుల వారీగా వారికి ఆయా ప్రాంతాన్ని పరిశుభ్రంగా రూపొందించే బాధ్యతలు అప్పగించాలన్నారు.
ఏడు యంత్రాల సహాయంతో నేల చదును చేసే పనులు, ముళ్ల పొదలు తొలగించే పనులు చేపడుతున్నామని, రెండు రోజుల్లో ఆ ప్రాంతాన్ని చదును చేయడం పూర్తిచేస్తామని జె.సి. తెలిపారు. గుంకలాం లే అవుట్ మొత్తం మళ్లీ కొలతలు వేసి సర్వే రాళ్లు వేయించే పనులు చేపడతామని రెవిన్యూ డివిజనల్ అధికారి బిహెచ్.భవానీ శంకర్ చెప్పారు. వై.ఎస్.ఆర్.గృహనిర్మాణ పథకం కింద పేదలకు నిర్మించే ఇళ్ల నమూనాలు ప్రదర్శించేందుకు రెండు మోడల్ ఇళ్లను నిర్మిస్తామని గృహనిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ ఎస్.వి.రమణమూర్తి చెప్పారు. ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్న పైలాన్‌ను కూడా సిద్ధం చేస్తామన్నారు. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం లోగోతో ఒక స్వాగత ద్వారం(ఆర్చి) నిర్మించాలని కలెక్టర్ ఆదేశించారు. మోడల్ ఇళ్ల నిర్మాణం కోసం అవసరమైన మెటీరియల్ సిద్ధంగా ఉంచినట్లయితే భద్రత అధికారుల సూచనల మేరకు ఎక్కడ నిర్మించాలో తెలియజేస్తామన్నారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేయాలని డి.పి.ఆర్.ఓ.రమేష్ కు కలెక్టర్ ఆదేశించారు. హరిత విజయనగరం కార్యక్రమాలకు సంబంధించిన వేదిక ప్రాంతంలో స్పష్టంగా కనిపించేలా లోగోను ప్రదర్శించడంతోపాటు చెరువుల అభివృద్ధి, మొక్కలు నాటే కార్యక్రమాలను తెలియజెప్పేలా ఏర్పాట్లు చేయాలని మునిసిపల్ కమిషనర్ వర్మకు సూచించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ప్రొటోకాల్ విధులతో పాటు ఆహ్వానపత్రాల తయారీ, పంపిణీ, ముఖ్యమంత్రి పర్యటన విధుల కేటాయింపు వంటి పనులు చేపట్టాలని జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావుకు ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమం మినిట్ టు మినిట్ ప్రోగ్రాం రూపొందించడంతోపాటు, గుంకలాం లే అవుట్ నమూనాను ఆకర్షణీయంగా, సులువుగా అర్ధమయ్యే రీతిలో రూపొందించి ప్రదర్శించాలని ముఖ్య ప్రణాళిక అధికారి విజయలక్ష్మికి సూచించారు. సభకు ఏయే ప్రాంతాల నుండి ఎంతమంది హాజరు అవుతారనే విషయాన్ని ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీ ప్రతినిధులతో చర్చించి అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్(ఆసరా) వెంకటరావుకు సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా,ఆర్.మహేష్ కుమార్ కూడా పాల్గొన్నారు.