సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరం..


Ens Balu
3
Vizianagaram
2020-12-19 21:52:59

విజయనగరం జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వైద్యాధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని సంయుక్త కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. వెక్టర్ బోర్న్ డిసీజెస్ పై జిల్లాస్థాయి వైద్యాధికారులతో శనివారం తన ఛాంబర్లో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వాతావరణం మారిన నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. దోమల వ్యాప్తి చెందకుండా మురుగు కుంటలను శుభ్రపరచాలని, నీటి నిల్వలు ఉండకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రై డే గా ప్రకటించి.. వ్యాధులపై సచివాలయ, వైద్య సిబ్బంది ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఆయా ప్రాంతాల్లో ఉండే పాఠశాలలో, వసతి గృహాల్లో దోమతెరలు ఏర్పాటు చేయించాలని చెప్పారు. గ్రామాల్లో దోమతెరలు పంపిణీ చేయాలని, వాటి ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయలని సూచించారు. వైద్య అధికారులు మిగతా శాఖల అధికారులతో సమన్వయంగా వ్యవహరించి దోమలు వ్యాప్తి చెందకుండా, వాటి ద్వారా సంక్రమించే వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇంటింటికీ ఏ.ఎన్.ఎం.లు, వైద్య సిబ్బంది వెళ్లి ప్రజల ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డి.ఎం.& హెచ్.వో. ఎస్.వి.రమణ కుమారి, డి.సి.హెచ్.ఎస్. నాగభూషణ రావు, అదనపు డి.ఎం.&హెచ్.వో.లు రామ్ మోహన్, రవికుమార్, డిప్యూటీ డి.ఎం.&హెచ్.వో.లు చామంతి, రవికుమార్ రెడ్డి, డి.ఎం.వో. తులసీ, ఇతర వైద్య అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.