అందరి సమిష్టి కృషితో ఆదివాసీల అభివ్రుద్ధి..కలెక్టర్


Ens Balu
3
Paderu
2020-08-09 20:27:02

అందరి సహకారం,సమిష్టి కృషితో నిరంతరం ఆదివాసీల అభివృద్దికి కృషి చేస్తామని ఐటిడి ఏ అధ్యక్షులు, జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ పేర్కొన్నారు. ఆదివారం స్దానిక తలారిసింగ్ కేంద్రీయాశ్రమోన్నత పాఠశాలలో ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన 38వ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పడు విశాఖపట్నం వచ్చినా గిరిజన ప్రాంతం అభివృధ్ది, సంక్షేమం, విద్య, వైద్య రంగాలపైనే ప్రత్యేకంగా తనతో చర్చిస్తారని చెప్పారు. మన్యానికి మెడికల్ కళాశాల మంజూరు చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేసారు. గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. మెడికల్ కళాశాల నిర్మాణానికి 35 ఎకరాల భూ సమీకరణ చేసామని త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదగా శంఖుస్తాపన జరుతుందన్నారు.కోవిడ్ నేపధ్యంలో విశిష్టమైన సేవలందిస్తున్న వైద్యులను అభినందించారు. ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖలో 5700 పోస్టులను భర్తీ చేస్తుందన్నారు. ముందగా ఏజెన్సీలో ఖాళీలను భర్తీ చేసిన తరువాత మైదానంలో భర్తీ చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ 50 కుటుంబాలకు ఒక వాలంటీర్‌ను నియమించి ప్రతీ కుటుంబానికి ప్రభుత్వ పధకాలు అందిస్తోందన్నారు. 212 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి ఒకే గొడుగు కింద ప్రభుత్వ సేవలను అందిస్తున్నారని చెప్పారు. అర్హులైన 33 255 మంది గిరిజనులకు 57546 ఎకరాలకు అటవీ హక్కుపత్రాలు పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని చెప్పారు. గత వారం ముఖ్యమంత్రి కార్యాలయపు ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ చింతపల్లి , జి.కె. వీధి మండలాల్లో పర్యటించి గిరిజనులతో చర్చించారన్నారు. మన్యంలో నవరత్నాలు అమలు తీరును వివరించారు. 11 మండలాల్లో మనబడి - నాడు నేడు కింద రూ.99.84 కోట్ల వ్యయంతో 367 పాఠశాలలను అభివృధ్ది చేసి మౌలిక సదుపాయలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రూ. 35 కోట్లతో 350 అంగన్వాడీ నిర్మాణాలు,రూ.25 కోట్లతో 135 వెల్‌నెస్ సెంటర్లు, రూ.500 కోట్లతో 1000 కిలో మీటర్ల రహదారి నిర్మాణాలు చేపట్టామని మార్చినాటికి పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాలు, వై ఎస్ ఆర్ ఆసరా, వై ఎస్ ఆర్ చేయూత, అమ్మ ఒడి, వై ఎస్ ఆర్ కంటి వెలుగు,పసుపు ప్రాజెక్టు అమలు తీరును వివరించారు. సభాధ్యక్షలు పాడేరు శాసన సభ్యురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించామని, వస్తానని హామీ ఇచ్చాని కరోనా నేపధ్యం లో పరిమితంగా ఆదివాసీ దినోత్సవం నిర్వహస్తున్నామన్నారు. ఆదివాసీలు గొప్ప దేశ భక్తులని పర్యావరణ సంరక్షకులని అన్నారు.గిరిజన సాంప్రదాయ పండగలు ఇటుకుల పండగ,కొర్రకొత్త పండగల వెనుక సైంటిఫిక్ రీజన్ ఉందన్నారు. స్వాతంత్య్ర సాధనలో గిరిజనులు, అల్లూరి సీతారామ రాజు నేతృత్వంలో ఎన్నొ పోరాటాలు చేసారని చెప్పారు. స్వాతంత్య్ర సమరంలో గాం మల్లుదొర, గంటందొర కీలకపాత్ర పోషించారని కొనియాడారు. కోవిడ్ మహమ్మారి ప్రభావం రాష్ట్ర ఆర్దిక పరిస్దితిపై పడిందన్నారు. అయినా ముఖ్యమంత్రి అభివృధ్ది ఫలాలను పేదలకు అందిస్తున్నారన్నారు. వై ఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో గిరిజన రైతులకు ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు పంపిణీ చేసారన్నారు. ముఖ్యమంత్రి 50 వేలమందికి లక్ష ఎకరాలకు పట్టాలు పంపిణీకి శ్రీకారం చుట్టారని అన్నారు. ప్రభుత్వ ఇచ్చిన డి.ఫారం పట్టా భూములో వ్యవసాయం చేయకుండా అక్రమంగా మైనింగ్ జరుగుతోందని దానిని నిరోధించాలని కోరారు. గిరిజన గ్రామాలకు నెట్‌వర్క్ సదుపాయాలు కల్పించాలన్నారు. కోవిడ్ మరణాలు సంభవించకుండా తగిన చర్యలు చేపట్టలన్నారు. అరకు శాసన సభ్యులు చెట్టి పాల్గుణ మాట్లాడుతూ గిరిజన హక్కులు, చట్టాలు పరిరక్షణకు , ఆదివాసీల అభివృధ్దికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం జారీ చేసిన జి. ఓ నెం.97ను వై ఎస్ సర్కారు రద్దు చేసిందన్నారు. జి. ఓ.నెం 3పై సుప్రీంకోర్టులో రిట్‌పిటిషన్ వేయడం జరిగిందని చెప్పారు. అరకులోయలో స్కిల్ డవలప్‌మెంట్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 1/70 చట్టం, 5వషెడ్యూలు,6వ షెడ్యూలు ప్రకారం గిరిజనుల జోలికి వస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. రాష్ట్రంలో అవినీతికి తావులేకుండా పరిపాలన జరుగుతోందని, అసత్యప్రచారాలు మానాలని చెప్పారు. అరకు నియోజక వర్గంలో రూ.49 కోట్ల 90 లక్షల వ్యయంతో 46రోడ్లు పనులు చేపట్టామన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. గిరిజన సాంప్రదాయ నృత్యం అలరించింది. ఐటిడి ఏ పి. ఓ డా. వేంకటేశ్వర్‌సలిజామల మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు, ఆదేశాల మేరకు కోవిడ్ నేపధ్యంలో పరిమిత జనాభాతో నిర్వహించామన్నారు. అనంతరం ఎన్ ఎస్ టి ఎఫ్ డిసి పధకం కింద 16 బొలేరో వాహనాలను, ఒక ట్రాక్టరును లబ్దిదారులకు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మత్స్యరాస మణికుమారి, మెడికల్ కౌన్సిల్ సభ్యులు టి.నర్సింగరావు, మార్కెట్ కమిటీ అధ్యక్షలు గాయిత్రీ దేవి, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
సిఫార్సు