కోవిడ్ వేక్సిన్ పంపిణీకి సిద్దం కావాలి..


Ens Balu
3
Srikakulam
2020-12-21 20:55:24

కోవిడ్ వాక్సినేషన్ ప్రక్రియకు వైద్య సిబ్బంది అందరూ సిద్ధంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కె.సి.చంద్ర నాయక్ ఆదేశించారు. కోవిడ్ వాక్సినేషన్ పై కోల్డ్ చైన్ బృందాలలో గల ఫార్మసిస్టులకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో సోమ వారం శిక్షణా కార్యక్రమం జరిగింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చంద్ర నాయక్ మాట్లాడుతూ కోవిడ్ వాక్సిన్ పూర్తిగా కొత్త విధానంలో పంపిణీ జరుగుతుందన్నారు. వాక్సిన్ విధి విధానాలు ప్రభుత్వం నుండి ఇంకా రావలసి ఉందని, దీనిపై అనుసరించాల్సిన అంశాలపై ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని ఆయన స్పష్టం చేసారు. ప్రభుత్వం నుండి అందిన వాక్సిన్ మానిటరింగ్ విధానానికి అనుగుణంగా అన్ని చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. వాక్సిన ఇచ్చే ప్రతి కేంద్రంలో వాక్సిన్ ఇచ్చే గదితో పాటు వేచి ఉండు గది, అబ్జర్వేషన్ గది ఉండాలని ఆయన తెలిపారు. వాక్సిన్ కేంద్రంలో తాగునీరు, మరుగుదొడ్లు విధిగా ఉండాలని పేర్కొన్నారు. వాక్సిన్ గది లోకి ప్రవేశం, బయటకు వెళ్లే మార్గాలు వేరుగా ఉండాలని సూచించారు. వాక్సినేషన్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా తప్పులు దొర్లరాదని ఆయన స్పష్టం చేసారు.  కోవిడ్ వాక్సిన్ ఇస్తున్నందున నిరంతరం ఇచ్చే ఇతర వాక్సినేషన్ నిలుపుదల చేయరాదని చెప్పారు. మొదటి దశలో వైద్య సిబ్బందికి, రెండవ దశలో ఫ్రంట్ లైన్ పనివారలకు, మూడవ దశలో ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి, 50 సంవత్సరాలు పైబడిన వారికి, అనంతరం 10 సంవత్సరాలు లోపు వయస్సు కలిగిన వారు, అటుపిమ్మట సాధారణ పౌరులకు వాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని ఆయన వివరించారు. అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.బి.జగన్నాథ రావు మాట్లాడుతూ కోవిడ్ సమయంలో వైద్య సిబ్బంది అద్భుతమైన సేవలు అందించారని ప్రశంసించారు. రెండవ దశ వ్యాప్తి అధికంగా ఉన్న సంగతి గుర్తించాలని, ఐరోపా దేశాల్లో మరల లాక్ డౌన్ ప్రకటించిన విషయం విదితమేనని ఆయన అన్నారు. కరోనా అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తం చేసిందని, మానవ సంబంధాలను కూడా దెబ్బతీసిందని పేర్కొ లేకుండా దీనిని పూర్తిగా నివారించి సాధారణ సమాజం నెలకొనే వరకు ఆరోగ్య సిబ్బంది సేవలు విస్తృతం చేయాలని పిలుపునిచ్చారు. వాక్సినేషన్ అందుబాటులోకి వస్తుందని,  పూర్తి జాగ్రత్తలు పాటించి వాక్సినేషన్ ఇవ్వాలని ఆయన అన్నారు. వాక్సినేషన్ పై చక్కటి అవగాహన పొందాలని సూచించారు. ముందుగా నమోదు చేసుకున్న వ్యక్తికి మాత్రమే వాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆయన కోరారు.  వాక్సిన్ ఇచ్చిన వ్యక్తిని నిర్దేశిత 30 నిమిషాల సమయం  అబ్జర్వేషన్ గదిలో విధిగా ఉంచాలని, వెంటనే ఇంటికి వెళ్లరాదని స్పష్టం చేసారు. వాక్సిన్ ఎంత మోతాదులో ఇవ్వాలి, ఎంత ఉష్ణోగ్రతలో ఉంచాలి, వాక్సిన్ భద్రపరచే విధానం తదితర విషయాల పట్ల అవగాహన పెంపొందించు కోవాలని సూచించారు. ప్రజా ఆరోగ్య రీత్యా చేపడుతున్న కార్యక్రమం అని గుర్తుపెట్టుకోవాలని, ఏ చిన్న పొరపాటు అయినా అనర్ధాలకు దారితీస్తుందని గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. వాక్సిన్ కు వినియోగించిన పరికరాలను సురక్షితంగా డిస్పోజ్ చేయాలని, సురక్షిత చర్యలు చేపట్టక పోతే అనర్ధాలు, దుష్ప్రభావాలు జరిగే అవకాశాలు ఉంటాయని ఆయన వివరించారు. ప్రజల ప్రాణాలు ముఖ్యమని, వాక్సిన్ ఇచ్చే చోట స్పిరిట్ తో శుభ్రం చేయరాదని, స్టెరైడ్ వాటర్ తో శుభ్రం చేయాలని సూచించారు. వాక్సిన్ ఇచ్చిన చోట రుద్ద రాదని చెప్పారు. జిల్లా టిబి నివారణ అధికారి డా.ఎన్. అనూరాధ మాట్లాడుతూ వాక్సినేషన్ బృందంలో నలుగురు సిబ్బంది ఉంటారన్నారు. వాక్సిన్ గదిలోకి ఒక వ్యక్తిని మాత్రమే అనుమతించాలని చెప్పారు. వాక్సినేషన్ కు వచ్చే వారికి నిర్ణీత సమయాన్ని ముందుగా తెలియజేసి ఆ సమయంలో మాత్రమే రావలసినదిగా సూచించాలని పేర్కొన్నారు. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్లు వినియోగించాలని కోరారు. వాక్సిన్ కార్యక్రమంపై మండల స్థాయిలో సమావేశం నిర్వహించాలని సూచించారు.  ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా.ఎల్.భారతి కుమారి దేవి, ఆర్బిఎస్కె జిల్లా సమన్వయ అధికారి డా.కె.అప్పారావు  తదితరులు పాల్గొన్నారు.