పరిశుభ్రతలో జిల్లా ఆదర్శంగా నిలవాలి..
Ens Balu
2
Vizianagaram
2020-12-21 22:10:30
పరిశుభ్రత అనే పవిత్రమైన బాధ్యతను జిల్లాలోని ప్రతిఒక్కరూ శాశ్వతంగా పాటించడం ద్వారా మన జిల్లాను పరిశుభ్రతలో ఆదర్శంగా నిలపాల్సి వుందని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ అన్నారు. పరిశుభ్రత ఏర్పరచడం ద్వారా మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంతోపాటు మన కుటుంబంలోని వృద్ధులు, పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోగలమన్నారు. పరిశుభ్రత కేవలం వ్యక్తులకు, కుటుంబానికి మాత్రమే పరిమితం కాకుండా గ్రామానికి, జిల్లా అంతటికీ విస్తరింపచేయాల్సి వుందన్నారు. పరిశుభ్రత ఏర్పరచడం, పచ్చదనం పెంచడం ద్వారా మాత్రమే ఆరోగ్యాన్ని నెలకొల్పగలమనే ఆశయంతో గత రెండేళ్లుగా జిల్లాలో పరిశుభ్రత, పచ్చదనానికి ప్రాధాన్యత ఇస్తూ పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మనం-మన పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా పక్షంరోజులపాటు నిర్వహించిన వ్యర్ధాలపై యుద్ధం ప్రచారోద్యమం ముగింపు వేడుకలు, ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ జన్మదిన వేడుకలను సోమవారం విజయనగరం రూరల్ మండలం జమ్ము నారాయణపురం పంచాయతీలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టడం వల్లే కరోనా మహమ్మారి ఏభై రోజులపాటు జిల్లాలో ప్రవేశించకుండా నిలువరించగలిగామన్నారు. కరోనాను కట్టడి చేసి జిల్లాను మళ్లీ గ్రీన్ జోన్‌గా మార్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నామని, రాష్ట్రంలో కరోనా రహితంగా వున్న మొట్టమొదటి జిల్లాగా రూపొందించే దిశగా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమ గ్రామాన్ని, తమ ప్రాంతాన్ని, జిల్లాను పరిశుభ్రంగా వుంచడంలో చిత్తశుద్ధితో ప్రయత్నిస్తానని పేర్కొంటూ జిల్లా కలెక్టర్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా ప్రజలందరి తరపున ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పేర్కొంటూ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావుతో కేకు కట్ చేయించారు.
అంతకు ముందు పడాలపేట జంక్షన్ నుండి నారాయణపురం గ్రామ సచివాలయం వరకు మనం- మన పరిశుభ్రతపై ఒక ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్‌తో పాటు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ నడిపేన శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు, జిల్లాపరిషత్ సి.ఇ.ఓ. టి.వెంకటేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి కె.సునీల్ రాజ్‌కుమార్, గ్రామీణ నీటిసరఫరా పర్యవేక్షక ఇంజనీర్ పప్పు రవి, భూగర్భ జలశాఖ డి.డి. కె.ఎస్.శాస్త్రి, ఏ.డి. రమణమూర్తి, మత్స్యశాఖ డి.డి. నిర్మలా కుమారి, రూరల్ ఎం.పి.డి.ఓ. చయనులు, గ్రామ సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, మహిళలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా వుంచడం, బహిరంగ మలవిసర్జన ను విడనాడటం, ప్రతిఒక్కరూ మరుగుదొడ్లను నిర్మించుకోవడం తదితర అంశాలపై నినాదాలు, ప్లే కార్డులతో ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణలో సేవలందిస్తున్న గ్రీన్ అంబాసిడర్లకు జిల్లా కలెక్టర్, ఏ.ఎం.సి. ఛైర్మన్, జె.సి. వెంకటరావు తదితరులు సత్కరించారు.