మానవాళికోసమే యేసు ప్రాణత్యాగం..
Ens Balu
2
Vizianagaram
2020-12-21 22:28:02
మనిషి ప్రకృతి పట్లా, సమాజం పట్లా బాధ్యతగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ కోరారు. మానవుల పాపాలను కడగడానికి యేసుప్రభువు ప్రాణత్యాగం చేశారని అన్నారు. ఆయన ప్రేమసాగరుడని స్తుతించారు. జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం సాయంత్రం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరైన కలెక్టర్ హరి జవహర్‌లాల్ మాట్లాడుతూ యేసు విశ్వరక్షకుడని కొనియాడారు. ఆయన్ను ఒక తండ్రిలా, కొడుకులా, మిత్రుడిలా, సేవకుడిలా ఎలా కొలిస్తే అలాగే మనలను కరుణిస్తాడని అన్నారు. నిరంతరం మనతో ఉండే దేవుడు యేసుప్రభువు అని అన్నారు. ప్రేమను పంచే దేవుడు యేసు అని, ప్రకృతిలో కూడా దైవత్వాన్ని చూడాలని కోరారు. భూమిని, ప్రకృతి వనరులను నాశనం చేయడం మహా పాపమన్నారు. మనిషి ప్రకృతికి దూరమైన కొలదీ, వ్యాధులకు దగ్గరవుతున్నాడని చెప్పారు. గత 30 ఏళ్ల క్రితంతో పోలిస్తే, ప్రస్తుతం మధుమేహం, రక్తపోటు, హృద్రోగం, కేన్సర్ లాంటి వ్యాధులు విపరీతంగా పెరిగిపోతుండటానికి నేల, నీరు, గాలిని కలుషితం చేయడం, చెడు అలవాట్లే కారణమని స్పష్టం చేశారు. విజయనగరం గొప్ప చారిత్రక, సాంస్కృతిక నగరమని, దానిని మనమంతా కాపాడుకోవాలని, హరిత విజయనగరంగా మార్చడానికి ప్రతీఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
శాసనమండలి సభ్యులు పెనుమత్స సురేష్‌బాబు మాట్లాడుతూ యేసు ప్రేమస్వరూపుడని పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో సైతం ఫాస్టర్లను ఆదుకొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి రూ.5వేలు పారితోషకాన్ని అందజేశారని, ఆయనతోపాటు, మన రాష్ట్రం, మన దేశం క్షేమంగా ఉండాలని ప్రతీఒక్కరూ ప్రార్ధనలు చేయాలని కోరారు.
జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నీలకంఠ ప్రధానో ఆధ్వర్యంలో, సంఘమిత్ర ఆర్ఎస్ జాన్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆశా జాన్ క్రిస్మస్ సందేశాన్ని వినిపించారు. ఈ సందర్భంగా ఆలపించిన యేసు కీర్తనలు అలరించాయి. జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్‌లాల్ కూడా పలు కీర్తనలు పాడి పరవశింపజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) జె.వెంకటరావు, డిఆర్ఓ ఎం.గణపతిరావు, దేవానంద్, బిషప్ ప్రతాప్, డేనియల్ గాంధీ, రాజశేఖర్, జాన్ వెస్లీ, ఆనంద్ పాల్, టి.ఆనంద్, ఎంఏ నాయుడు, జోషురాజ్, డాక్టర్ కెజె ఫిలోమెన్, ఆర్ఏఎస్ కుమార్, ఎం.క్రిష్టోఫర్ తదితర క్రైస్తవ ప్రముఖులు, సాంఘిక సంక్షేమశాఖ డిడి కె.సునీల్‌రాజ్‌కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.