త్వ‌ర‌లో భూ వివాదాల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం..


Ens Balu
2
Vizianagaram
2020-12-21 22:36:29

భూస‌మ‌స్య‌ల శాశ్వ‌త‌ ప‌రిష్కారానికి రాష్ట్ర ప్ర‌భుత్వం సాహ‌సోపేత కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది.  దీనిలో భాగంగా  రాష్ట్రంలో సమగ్ర భూముల సర్వేకు సంక‌ల్పించింది. దీనికోసం ‘వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం’ ఈ నెల 21న ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి కృష్ణాజిల్లాలో ప్రారంభించారు. సర్వే ఆఫ్‌ ఇండియా సంయుక్త భాగస్వామ్యంతో ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టింది. ఈ కార్య‌క్ర‌మం జిల్లాలో ఈనెల 23వ తేదీ బుధ‌వారం బొండ‌ప‌ల్లి మండ‌లం త‌మ‌టాడ గ్రామంలో  ప్రారంభం కానుంది. మూడు ద‌శ‌ల్లో స‌ర్వే పూర్తి                    సర్వే ఆఫ్‌ ఇండియా, రెవెన్యూ, సర్వే, పంచాయతీరాజ్, మున్సిపల్‌ శాఖల సంయుక్త భాగస్వామ్యంతో , ‘వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం’ అమలు చేస్తున్నారు. మీ భూమి..మా హామీ నినాదంతో తొలి దశ సర్వే ఈనెల నుంచి వచ్చే ఏడాది (2021) జూలై వరకు, రెండో దశ సర్వే 2021 అక్టోబరు నుంచి 2022 ఏప్రిల్‌ వరకు, చివరిదైన మూడో దశ సర్వే జూలై 2022 నుంచి 2023 జనవరి వరకు కొనసాగనుంది. జిల్లాలో తొలుత త‌మ‌టాడ‌ గ్రామంలో న‌మూనా క్రింద స‌ర్వే నిర్వ‌హిస్తారు. ఈ స‌ర్వేలో స‌ర్వేలో భాగ‌స్వామ్యం కానున్న ప్ర‌తీ ఒక్క‌రూ పాల్గొంటారు. రెండో విడ‌త‌లో 34 మండ‌లాల నుంచి 34 గ్రామాల‌ను ఎంపిక చేస్తారు. మూడోద‌శ‌లో జిల్లాలోని స‌గం ప్రాంతాన్ని సుమారుగా 499 గ్రామాల‌ను ఎంపిక చేసి స‌ర్వే పూర్తి చేస్తారు. ముందుగా డ్రోన్‌ల ద్వారా గ్రౌండ్ స‌ర్వే నిర్వ‌హిస్తారు. త‌రువాత భూముల‌పై మాన్యువ‌ల్‌గా స‌ర్వే చేసి, రెండింటినీ అనుసంధానం చేస్తారు. దీనివ‌ల్ల ఖ‌చ్చిత‌మైన వివ‌రాలు న‌మోద‌వుతాయి. ఎటువంటి పొర‌పాట్ల‌కు అవ‌కాశం లేనివిధంగా కార్స్ స‌‌ర్వే (కంటిన్యూస్ ఆప‌రేష‌న్ రిఫ‌రెన్స్ స్టేష‌న్‌) విధానాన్ని రూపొందించింది ప్ర‌భుత్వం. దీనికోసం జిల్లాలో ఎస్‌కోట‌, సాలూరు, జిఎల్‌పురం వ‌ద్ద బేస్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. సర్వే జ‌రిగే తీరు ఇదీ :                తొలుత గ్రామ సభల ద్వారా సర్వే విధానం, షెడ్యూలు, ప్రయోజనాలు వివరిస్తారు. ఆ తర్వాత గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శి, సర్వేయర్లతో కూడిన బృందాలు సర్వే నిర్వహిస్తాయి. డ్రోన్, కార్స్, రోవర్‌ వంటి పరికరాల ద్వారా ప్రతి స్థిరాస్తిని కచ్చితమైన భూ అక్షాంశ – రేఖాంశాలతో గుర్తించి కొత్తగా సర్వే, రెవెన్యూ రికార్డులు రూపొందిస్తారు. ప్రతి యజమానికి నోటీసు ద్వారా ఆ సమాచారం అందజేస్తారు. వాటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే, గ్రామ సచివాలయంలోని గ్రామ సర్వే బృందాల ద్వారా అప్పీలు చేసుకుంటే, అవి సత్వరం పరిష్కారం అయ్యేలా ప్రతి మండలంలో మొబైల్‌ మెజిస్ట్రేట్‌ బృందాలు ఏర్పాటు చేస్తున్నారు.  సర్వే పూర్తైన తర్వాత ప్రతి ఆస్తికి శాశ్వత హక్కు పత్రం ఇస్తారు. రెవెన్యూ రికార్డులు, ఇతర వివరాలు గ్రామాల్లో డిజిటల్‌ రూపంలో కూడా అందుబాటులో ఉంటాయి. సర్వేవ‌ల్ల ప్ర‌యోజ‌నాలు : – ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత భూఆస్తి హక్కు పత్రం – ల్యాండ్‌ పార్సెల్‌ మ్యాప్‌ (ఎల్‌పీఎం) – రెవెన్యూ విలేజ్‌ మ్యాప్‌ – భూమికి విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయింపు – అభ్యంతరాల సత్వర పరిష్కారానికి మండల స్థాయిలో మొబైల్‌ మెజిస్ట్రేట్‌ బృందాలు – ఉచిత వైయస్సార్‌ జగనన్న భూరక్ష హద్దు రాళ్లు – గ్రామ సచివాలయాల్లోనే సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసు వివిదాల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం :  జాయింట్ క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్‌    వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకంలో భాగంగా ప్ర‌‌భుత్వం చేప‌ట్ట‌నున్న తాజా స‌ర్వే ద్వారా  దళారీ వ్యవస్థకు చెక్ ప‌డుతుంది. అత్యంత‌ పారదర్శకంగా, నిష్పాక్షికంగా, అవినీతికి తావు లేకుండా భూలావాదేవీలు, ప్రతి భూభాగానికి విశిష్ట గుర్తింపు సంఖ్య ల‌భిస్తుంది. భూయజమానులకు తమ భూములపై వేరెవరూ సవాల్‌ చేయడానికి వీలు కాని శాశ్వత హక్కులు ల‌భించ‌డం ద్వారా భూవివాదాలకు తావు ఉండ‌దు. ముఖ్యంగా  రికార్డుల స్వచ్ఛీకరణ జ‌రిగి, వాస్తవంగా ఉన్న భూముల విస్తీర్ణం ప్రకారం కొత్త రికార్డులు త‌యార‌వుతాయి.  ఆ తర్వాత ఉచితంగా వైయస్సార్‌ జగనన్న భూరక్ష హద్దురాళ్లు ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతుంది.  కొన్నిచోట్ల  రికార్డుల్లో చోటుచేసుకున్న త‌ప్పుల‌న్నీ స‌రిజేయ‌బ‌డ‌తాయి. ఇకపై ఆస్తి, క్రయ, విక్రయ, తనఖా, దాన, వారసత్వ, ఇతర లావాదేవీలు వివాదరహితం అవుతాయి. అంతే కాకుండా ఆయా ప్రక్రియలు సులభతరం అవుతాయి. రిజిస్ట్రేషన్‌ కూడా గ్రామంలోనే చేసుకునే వెసులుబాటు ఈ స‌ర్వేద్వారా ల‌భిస్తుంది.