శ్రీకాకుళంలో ప్రారంభమైన భూసర్వే..


Ens Balu
4
Srikakulam
2020-12-22 13:59:02

వివాద రహిత భూమిని ఆవిష్కరించడమే మీ భూమి మా హామీ ఆశయమని రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.    వై.యస్.ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూ రక్ష పథకం భూముల సమగ్ర సర్వే 2020 మీ భూమి - మా హామీ కార్యక్రమంను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ సొంత మండలం, పొలాకి మండలం కొండ లక్కివలస గ్రామంలో  రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మంగళవారం ప్రారంభించారు.  కొండలక్కివలస గ్రామంలో 314 ఎకరాల భూమి, 205 మంది రైతులు ఉన్నారు. 169 ఎకరాలు జిరాయితి భూమి కాగా, 145 ఎకరాలు ప్రభుత్వ భూమిగా ఉంది. వివాదాలు లేకుండా భూమి ఉండాలని రైతులు కోరుకుంటున్నారని స్పీకర్ అన్నారు. వివాదాలు ఉంటే రైతుకు వేదన ఉంటుందని చెప్పారు. రైతు వేదన తీర్చుటకు ప్రభుత్వం సంకల్పించిందని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సర్వే చేపట్టడం జరుగుతుందని అన్నారు. మూడు దశలుగా జరుగుతుందని అందరూ సహకరించాలని కోరారు.  సుమారు వెయ్యి కోట్ల రూపాయలతో రీ సర్వే కార్యక్రమం ను ప్రభుత్వం చేపడుతుందన అన్నారు. రాష్ట్రంలో 4,500 బృందాలు పనిచేస్తాయని చెప్పారు. 17 వేల గ్రామాల్లో 2.62 కోట్ల ఎకరాల్లో   రీ సర్వే రాష్ట్రంలో జరుగుతుందని స్పీకర్ తెలిపారు. జిల్లాలో సమర్థవంతమైన అధికార యంత్రాంగం ఉందని, రీ సర్వే విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 13375 గ్రామాల్లో 40 లక్షల ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయని,110 పట్టణ ప్రాంతాల్లో  10 లక్షల ఆస్తులు ఉన్నాయని వాటిని రీ సర్వేలో గుర్తించడం జరుగుతుందని వివరించారు. అస్తవ్యస్తంగా ఉన్న రికార్డులను సక్రమంగా చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. గ్రామ సచివాలయంలో భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపారు. ప్రభుత్వానికి ఒక లక్ష్యం ఉందని స్పీకర్ పేర్కొన్నారు. రీ సర్వే పక్కాగా జరుగుతుందని ఆయన చెప్పారు. రీ సర్వే కార్యక్రమం దేశానికే మార్గదర్శనం చేస్తుందని, తలమానికంగా ఉంటుందని ఆయన అన్నారు. మీ ఆస్తికి రక్షణ, హక్కు ఈ కార్యక్రమం కల్పిస్తుందని పేర్కొన్నారు.         జిల్లా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో 50 శాతం భూ వివాదాలకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయని చెప్పారు. ఆంగ్లేయులు వంద సంవత్సరాలు క్రితం సర్వే చేశారని, 60 సంవత్సరాలు క్రితం రీ సర్వే చేశారని చెప్పారు. ప్రస్తుత రీ సర్వే వలన 95 శాతం మందికి మంచి ఫలితాలు వస్తాయని ఆయన అన్నారు. సంవత్సరానికి మూడో వంతు గ్రామాల్లో సర్వే జరుగుతుందని వివరించారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో కార్యక్రమంను చేపడుతుందని, రైతులు సహకరించి విజయవంతం చేయాలని ఆయన కోరారు. మీ భూమి మా హమీ అంటూ ప్రభుత్వం భరోసా ఇస్తుందని కలెక్టర్ అన్నారు. రీ సర్వే అనంతరం గ్రామ సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ చేయుటకు ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. గ్రామ భవిష్యత్తు దృష్ట్యా ప్రజలు తోడ్పాటును అందించాలని పిలుపునిచ్చారు.       జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ ప్రయోగాత్మకంగా   కొండ లక్కివలస గ్రామంలో చేపట్టడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో సంవత్సర కాలంలో 621 గ్రామాల్లో రీ సర్వే చేస్తామని అన్నారు. రైతులు సహకరించాలని కోరారు. భూ వివాదాలు నివారణకు ఒక బృందం ఉంటుందని, వెంటనే పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు. గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్ జరుగుతుందని చెప్పారు. గ్రామాల్లో సరిహద్దు నిర్ణయంతో సహా ప్రభుత్వ భూమి, ఇతర భూములు గుర్తింపు చేసి డిజిటల్ పత్రాలు జారీ చేస్తామని చెప్పారు.         జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి మాట్లాడుతూ రైతు వివరాలు రెవెన్యూ రికార్డులలో సక్రమంగా నమోదు కావాలని అన్నారు. రైతు వద్ద హక్కు పత్రాలు ఉండాలని ఆయన పేర్కొన్నారు. పెద్ద కార్యక్రమమని, ప్రస్తుతం గ్రామ సచివాలయాల్లో అర్హత కలిగిన సర్వేయర్లు ఉన్నారని పేర్కొన్నారు. సర్వే జరగడం వలన రైతులకు పూర్తి రక్షణ ఉంటుందని ఆయన చెప్పారు. భూ వివాదాలు లేకపోవడంతో భూముల విలువ పెరుగుతుందని, అదనంగా భూమి సాగులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు.        ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి ఐ.కిషోర్, సర్వే సహాయ సంచాలకులు కె.ప్రభాకర్, మాజీ కేంద్ర మంత్రి డా.కిల్లి కృపారాణి, జిల్లా వ్యవసాయ సలహా సంఘం ఛైర్మన్ కరిమి రాజేశ్వరరావు, కాళింగ కార్పొరేషన్ డైరెక్టర్ కంది కృష్ణా రావు, స్థానిక నాయకులు డా.ధర్మాన క్రిష్ణ చైతన్య, తమ్మినేని భూషణం, తహసీల్దార్లు శ్రీనివాసరావు, సింహాచలం, ప్రవల్లిక., ఎం.పి.డి.ఓ రాధాకృష్ణ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.