క్రీస్తు బోధనలతో శాంతి సమాజం..


Ens Balu
3
Srikakulam
2020-12-22 14:00:53

క్రీస్తు బోధనలతో శాంతి యుత సమాజం ఏర్పడుతుందని సంయుక్త కలెక్టర్ ఆర్.శ్రీరాములు నాయుడు పేర్కొన్నారు. మంగళవారం   జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క్రిస్టమస్ సందర్భంగా తేనీటి విందు కార్యక్రమం జరిగింది.  కార్యక్రమానికి సంయుక్త కలెక్టర్ ఆర్.శ్రీరాములు నాయుడు ముఖ్య అతిధిగా విచ్చేసారు.  ఈ సందర్భంగా జె.సి. మాట్లాడుతూ, మానవాళి మనుగడకు, సమాజ అభ్యన్నతికి, శాంతి యుత సమాజ స్థాపనకు క్రీస్తు బోధనలు అవసరమని అన్నారు. క్రీస్తు ప్రభోదాలు ఆచరణీయమని,  సమాజానికి ఎంతో అవసరమని తెలిపారు. రాష్ట్ర ప్రజలు సర్వతోముఖాభివృద్ది సాధించాలని కోరుకుంటున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని, అన్నారు. అందరూ మత సామరస్యంతో ఉండాలని, జిల్లా లో శాంతి ఎప్పటి వలె కొనసాగాలని, క్రిస్మస్ అన్ని కుటుంబాల్లో ఆనందాన్ని, సంతోషాన్ని నింపాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.  క్రైస్తవులకు  ప్రభుత్వం మంజూరు చేసిన స్థలానికి అవసరమగు సహాయాన్ని అందించుటకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. బిషప్ డి.ఎస్.వి.ఎస్.కుమార్ క్రీస్తు సందేశాన్ని వినిపించారు.   భగవంతుని చేరుకునే మార్గాన్ని చూపడానికి దేవుని బిడ్డగా భూమిపై అవతరించిన మహాపురుషుడు ఏసు క్రీస్తు అని తెలిపారు. సర్వమానవాళికి రక్షకుడు, ప్రేమ స్వరూపుడు, ఓర్పు, సహనం, ప్రేమ, సేవాభావాలను మానవాళికి తెలియ చెప్పాడని తెలిపారు.    జిల్లా అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ అధికారి పి.నీలకంఠం మైనారిటీ సంక్షేమశాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా జె.సి. క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు. మత పెద్దలు ప్రార్థనలు చేశారు.  ప్రధాన మంత్రి 15 సుత్రాల కార్యక్రమం కమిటీ సభ్యులు పి. కృపానందం స్వాగతం చెప్పారు. సి.హెచ్.ప్రేమ్ కుమార్, ఎచ్చెర్ల పాస్టర్ల అధ్యక్షులు సామ్యూల్ ప్రార్ధనలు  చేసారు.  క్రొవ్వొత్తులను వెలిగించి క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు.                 ఈ కార్యక్రమంలో,  ప్రధాన మంత్రి  15 సూత్రాల కార్యక్రమం సభ్యులు మహిబుల్లా ఖాన్,  జ్ఞాన రాజు, ఆండ్రూస్, డి.వి.డి.వి.కుమార్, పాస్టర్ బర్నాబాస్, సామ్యూల్, క్రిస్టియన్ మత పెద్దలు,  తదితరులు పాల్గొన్నారు.