ప్రైవేటు లేవుట్లకు ధీటుగా ప్రభుత్వ ఇళ్ల స్థలాలు..
Ens Balu
2
Anantapur
2020-12-22 15:57:33
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా ఇంటి పట్టాల పంపిణీ కోసం సిద్ధం చేసిన ప్రభుత్వ లేఔట్ లను ప్రైవేటు లేఔట్లు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉండేలా అన్ని రకాలుగా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. మంగళవారం తాడిపత్రి పట్టణ పరిధిలోని లబ్ధిదారులకు అందజేసేందుకు యర్రగుంటపల్లి గ్రామం వద్ద, ఆర్డీటీ కాలనీ (గన్నవారిపల్లి కాలనీ)వద్ద, సజ్జలదిన్నె గ్రామ పరిధిలో ఏర్పాటు చేసిన ఇంటి పట్టాల లేఔట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటి పట్టాల పంపిణీ కోసం సిద్ధం చేసిన లేఔట్ లలో సకల సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ప్రతి లేఔట్ వద్ద లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలన్నారు. లాటరీలలో కేటాయించిన విధంగానే ఏ ఫ్లాట్ లో ఉన్న లబ్ధిదారులు ఆ ఫ్లాట్లోనే ఇళ్లు కట్టుకునేలా చూడాలన్నారు. భవిష్యత్తులో లబ్ధిదారులకు కేటాయించిన ఫ్లాట్ కాకుండా ఇతర ఫ్లాట్ లకు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. భవిష్యత్తులో ఎప్పుడు ఎవరు వచ్చి తనిఖీ చేసినా కేటాయించిన ఇంటి స్థలం లోనే ఆ యజమాని ఉండేవిధంగా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
తాడపత్రి పట్టణ లబ్ధిదారులకు అందజేసేందుకు రూరల్ పరిధిలోని యర్రగుంటపల్లి గ్రామం వద్ద సిద్ధం చేస్తున్న లేఔట్లో పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఆర్డీటీ కాలనీ (గన్నవారిపల్లి కాలనీ)వద్ద లేఔట్ లో అన్ని రకాల పనులు పూర్తి చేయడంపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. సజ్జలదిన్నె వద్ద సిద్ధం చేసిన లేఔట్ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా లేదని, వెంటనే పూర్తిస్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు చేయాలన్నారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా లేఔట్ ను సిద్ధం చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లేఔట్లకు సంబంధించి మ్యాప్ లను పరిశీలించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ తాడిపత్రి మున్సిపాలిటీని పరిశీలించి పలు రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు జిల్లా కలెక్టర్ కు తమ సమస్యలను వివరించారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విశ్వేశ్వర్ నాయుడు, మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్, తహసీల్దార్ నాగభూషణ, ఈఓఆర్డీ జిలాన్ భాష, ఏపీఓ గంగరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.