హరిత విజయనగరానికి రజత పురస్కారం..
Ens Balu
1
Vizianagaram
2020-12-22 20:39:47
విజయనగరం జిల్లా విజయాలకు ఖిల్లాగా మారింది. తాజాగా జిల్లాకు మరో స్కోచ్ అవార్డు వరించింది. హరిత విజయనగరం సాధనే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ చేసిన కృషిని గుర్తిస్తూ, స్కోచ్ కమిటీ మంగళవారం విజయనగరం జిల్లాకు రజత పురస్కారాన్నిప్రకటించింది. దీంతో జాతీయస్థాయిలో జిల్లా ఖ్యాతి మరోసారి మారుమ్రోగింది. విజయనగరం జిల్లాకు పురస్కారాల పరంపర కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్‌లాల్ అత్యంత ప్రాధాన్యతాంశాలు మూడింటిలోనూ అవార్డులను దక్కించుకోవడం ద్వారా జిల్లా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు. కలెక్టర్ ఏ కార్యక్రమంలో పాల్గొన్నా తప్పనిసరిగా మూడు నినాదాలను విరివిగా ప్రజల్లోకి తీసుకువెళ్తూ వచ్చారు. డొనేట్ రెడ్, సేవ్ బ్లూ, స్ప్రెడ్ గ్రీన్ నినాదాలు ఇప్పటికే విస్తృత ప్రాచుర్యం పొందాయి. డొనేట్ రెడ్ పేరుతో జిల్లాలో రక్తదానానికి బహుళ ప్రాచుర్యం కల్పించారు. ఈ నినాదం స్ఫూర్తితో వేలాదిమంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు. ఫలితంగా రక్తదానంలో ఇండియన్ రెడ్‌క్రాస్ నుంచి జిల్లాకు పురస్కారం లభించింది.
ప్రకృతిని సంరక్షించాలని, భావితరాలకోసం నీటి వనరులను కాపాడుకోవాలని కలెక్టర్ ప్రజలకు పిలుపునివ్వడమే కాకుండా, స్వయంగా తానే చెరువులను శుద్ది చేయడానికి నడుంబిగించారు. నిత్యం ఏదో ఒక చెరువును శుద్దిచేసి, చెత్తా చెదారాలను తొలగించి, వాటి గట్లపై మొక్కలను నాటి, వందలాది చెరువులను నందన వనాలుగా తీర్చిదిద్దారు. జిల్లాలో చెరువుల సంరక్షణకు జరిగిన కృషికి గుర్తింపుగా కేంద్ర జలశక్తి శాఖ ఇటీవలే జిల్లాకు జాతీయ అవార్డును అందజేసింది. దీంతో జిల్లా ఖ్యాతి జాతీయస్థాయికి ఎగసింది.
అనునిత్యం మొక్కలను నాటడం జిల్లా కలెక్ట్‌ర్‌కు దినచర్యగా మారింది. ఈ ఏడాది ఇప్పటికే జిల్లాలో సుమారు కోటి, 36లక్షలకు పైగా మొక్కలను నాటారు. జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించకముందు నుంచే జిల్లా కలెక్టర్ హరిత యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. హరిత విజయనగరంగా మార్చేందుకు జిల్లా కేంద్రంలోనే వేల సంఖ్యలో మొక్కలను నాటారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛంద సంస్థలు, వేలాదిమంది యువకులు పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. ఫలితంగా జిల్లాకు తాజాగా మంగళవారం సాయంత్రం స్కోచ్ అవార్డు లభించింది. అంతకుముందు జిల్లాలో కోవిడ్ నియంత్రణకు తీసుకున్న చర్యలపై కలెక్టర్ స్కోచ్ కమిటీ ముందు వర్చువల్ విధానంలో ప్రసంగించారు. అనంతరం జిల్లా రజత పురస్కారానికి ఎంపికైనట్లు ప్రకటన వెలువడింది. అదేవిధంగా స్వచ్ఛభారత్‌లో బొబ్బిలి మున్సిపాల్టీకి స్కోచ్ రజిత పురస్కారం లభించింది.
ఇటీవలే వ్యక్తిగతంగా మేన్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అవార్డును గెలుచుకున్న కలెక్టర్ హరి జవహర్‌లాల్, తాను అత్యంత ఇష్టపడే మూడు అంశాల్లోనూ అవార్డులను సాధించడం పట్ల జిల్లా అంతటగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అవార్డు ప్రకటన వెలువడిన వెంటనే, ప్రజాప్రతినిధులు, జాయింట్ కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు కలెక్టర్‌ను అభినందనలతో ముంచెత్తారు.
జిల్లా ప్రజలకు అంకితం ః కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్
హరిత యజ్ఞంలో భాగస్వాములైన ప్రతీఒక్కరికీ ఈ స్కోచ్ పురస్కారాన్ని అంకితం చేస్తున్నాను. హరిత విజయనగరం సాధన కోసం నాతో కలిసి నిత్యం అడుగులు వేసిన ప్రతీఒక్కరికీ అభినందనలు. మనందరి సమిష్టి కృషి వల్లే, ఈ మనకు ఈ అరుదైన గుర్తింపు లభించింది. ఈ అవార్డులను స్ఫూర్తిగా తీసుకొని ప్రకృతి వనరుల సంరక్షణకు, మొక్కలను నాటడానికి మనమంతా పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నా. రజత పురస్కారాన్ని గెలుచుకున్న బొబ్బిలి మున్సిపాల్టీకి ప్రత్యేక అభినందనలు.