సమగ్ర భూ సర్వేతో భూ సమస్యలు దూరం..
Ens Balu
3
Penugonda
2020-12-23 17:14:29
"వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం" అనేది ఒక బృహత్తర పథకమని రాష్ట్ర ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలంలోని ఎస్.కొత్తపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల వద్ద బుధవారం "వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం" సమగ్ర రీ సర్వేను శాస్త్రోక్తంగా భూమి పూజ చేసి, సరిహద్దు రాయిని పాతి జిల్లాలో పథకాన్ని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడులు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ కాపు మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానంతో పక్కాగా సమగ్ర రీ సర్వేతో భూ వివాదాల కు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 21వ తేదీన కృష్ణా జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి "వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం" సమగ్ర రీ సర్వేను ప్రారంభించారని తెలిపారు. ఒక తల్లికి తన బిడ్డపై ఎంతో మమకారం ఉంటుందో భూమిపై రైతుకు కూడా అంతే మమకారం ఉంటుందన్నారు. భూమి తగాదాలు అన్నవి జీవితాలు నాశనం చేస్తాయని, రాష్ట్ర ముఖ్యమంత్రి గొప్ప ఆలోచన చేసి మీ భూమి మా హామీ లక్ష్యంతో భూమి సమస్యలు రాకూడదని సమగ్ర సర్వే మొదలుపెట్టారన్నారు. దేశంలోనే అత్యంత సమర్థత కలిగిన ముఖ్యమంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ నాలుగో స్థానంలో నిలిచారని, సమగ్ర సర్వే ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి చరిత్ర సృష్టిస్తారన్నారు. సమగ్రమైన సర్వే ద్వారా భూములకు సంబంధించి కచ్చితమైన రికార్డు ఉంటుందని, సర్వే ఆఫ్ ఇండియా సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుని ఈ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. శాటిలైట్ ద్వారా ఖచ్చితమైన కొలతలతో భూముల సర్వే చేయడం ద్వారా దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలబడుతుందన్నారు. భూమి సమస్యలు తొలగాలంటే జీవిత కాలం పడుతుందని అలాంటి భూమి సమస్యలను ప్రభుత్వమే బాధ్యత తీసుకొని సర్వే చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరికి ఏ తగాదాలు లేకుండా పక్కాగా భూమి హక్కు కల్పిస్తామన్నారు. సమగ్ర సర్వే కు ప్రజలు కూడా సహాయ సహకారాలు అందించాలన్నారు. ఎలాంటి డాక్యుమెంట్లు అడగకుండా సర్వే చేయడం జరుగుతుందని, సర్వేయర్ల అంతా బాగా పని చేయాలన్నారు. పలు ప్రభుత్వ పథకాలలో అనంతపురం జిల్లా మొదటి స్థానంలో ఉందని సమగ్ర సర్వేలో కూడా అనంతపురం జిల్లా మొదటి స్థానంలో నిలిచేలా సర్వేయర్లు విధులు నిర్వహించాలన్నారు.
దేశంలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్రంలో "వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం"అమలు
: జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు
దేశంలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో "వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం"అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1000 కోట్ల రూపాయలకు పైగా సమగ్ర సర్వే కోసం ఖర్చు పెడుతున్నట్లు తెలిపారు. గ్రామాల్లో గ్రామ కంఠం భూములు, ఇంటి స్థలాలు, ప్రైవేట్ భూములు, వ్యవసాయ పొలాలు తదితర అన్ని రకాల భూములు ఎంత ఉన్నాయి అనేది సర్వే చేసి హక్కు పత్రాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. సోమందేపల్లి మండలంలోని ఎస్.కొత్తపల్లి గ్రామంలో ఒకే భూ సమస్య తమ దృష్టికి వచ్చిందని, అందుకోసం ఈ గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి మీ భూమి మా హామీ కింద సమగ్ర సర్వే కార్యక్రమాన్ని ఈ గ్రామంలో ప్రారంభించడం జరిగిందన్నారు. ఇది ఎంతో చారిత్రాత్మకమైన రోజని, భూముల సర్వే పక్కాగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ల్యాండ్ సర్వే లు ప్రజలంతా కొన్ని కాలాలపాటు గుర్తుంచుకునేలా అందరూ బాగా పని చేయాలని, భూముల సర్వే లో రాళ్ళు పాతడానికి ఒక్క పైసా కూడా తీసుకునేది లేదన్నారు. ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి మాట్లాడుతూ మీ భూమి మా హామీ కింద సమగ్ర సర్వే కు ప్రజల సహకారం అందించాలన్నారు. ఎవరికి ఎంత భూమి అనేది పక్కాగా సర్వే చేయడం జరుగుతుందని, ప్రజలు సర్వేను సద్వినియోగం చేసుకోవాలన్నారు. భూమి విలువ పెరగడంతో ఘర్షణలు కూడా పెరిగాయని సర్వే కరెక్ట్ గా చేయించుకోవడం ప్రజల బాధ్యత అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్ మాట్లాడుతూ వందేళ్ల తర్వాత "వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం" కింద భూముల సమగ్ర సర్వే జరుగుతోందని, దీని ద్వారా ప్రజలకు ఎంతో మంచి జరుగుతుందన్నారు. ప్రతి కుటుంబంలోనూ భూమి సమస్యలు ఉంటాయని సమగ్ర సర్వే ద్వారా భూమి సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు. ప్రజలకు శాశ్వతంగా భూమి హక్కు కల్పించడం కోసం ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించిందన్నారు.
అంతకుముందు డ్రోన్ ద్వారా గ్రామంలో భూముల రీ సర్వేను విప్, కలెక్టర్ లు ప్రారంభించారు..
ఈ కార్యక్రమంలో పెనుకొండ సబ్ కలెక్టర్ నిషా0తి, సర్వే శాఖ ఏడీ మచ్చింద్రనాథ్, సర్వే ఆఫ్ ఇండియా సర్వేయర్ చక్రధరరావు, సర్వే సూపర్వైజర్ నర్సింగరావు, ఇన్స్పెక్టర్ కృపాకర్, డిఐఓఎస్ చిట్టి బాబు, ఆర్డివో లు రామ్మోహన్, మధుసూదన్, ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఆయా శాఖల అధికారులు, సర్వేయర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.