ఆరోగ్యాంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యం..
Ens Balu
2
2020-12-23 17:18:54
విద్య, వైద్యం ప్రభుత్వానికి రెండు కళ్లులాంటివని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖామంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ స్థాపనే మఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. గజపతినగరంలో ఎపి వైద్య విధానపరిషత్, ఎపిఎంఎస్ఐడిసి ఆధ్వర్యంలో సమారు రూ.17కోట్లతో నిర్మితం కానున్న 100 పడకల ఆసుపత్రికి బుధవారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ వైద్య రంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. దీనిలో భాగంగా జిల్లాలో సుమారు రూ.653కోట్లతో వివిధ ఆసుపత్రులు నిర్మాణం, అభివృద్ది జరగనుందని తెలిపారు. గజపతినగరంలో 30 పడకల ఆసుపత్రిని 100 పడకలకు పెంచుతున్నట్లు చెప్పారు. అదేవిదంగా ఈ ఆసుపత్రిలో 5గురు డాక్టర్లు, ఆరుగురు సిబ్బంది ఉండేవారని, ప్రస్తుతం 16 మంది డాక్టర్లను, 24 మంది సిబ్బందిని ఏర్పాటు చేశామని తెలిపారు. 100 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే, మరో ఐదుగురు సివిల్ సర్జన్లు, ఒక ఆర్ఎం, ఒక మెడికల్ ఆఫీసర్, డిప్యూటీ సర్జన్ వస్తారని చెప్పారు. సాలూరులో ప్రస్తుతమున్న 30 పడకల ఆసుపత్రిని రూ17కోట్లతో 100 పడకల ఆసుపత్రి స్థాయికి పెంచుతామని, అలాగే ఎస్.కోట ఆసుపత్రిని రూ.12.6కోట్లతో 50 నుంచి 100 పడకలకు, కురుపాంలో 30 పడకల నుంచి 50 పడకలకు, బాడంగిలో 30 పడకలు నుంచి 50 పడకలకు, భద్రగిరిలో 30 నుంచి 50 పడకలకు, రూ.9కోట్లు చొప్పున వెచ్చించి ఆయా ఆసుపత్రుల స్థాయిని పెంచనున్నట్లు తెలిపారు. అదేవిధంగా పార్వతీపురంలో 100 నుంచి 150 పడకలకు పెంచి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ది చేస్తామని, నెల్లిమర్ల, భోగాపురం, బొబ్బిలి ఆసుపత్రులను కూడా అభివృద్ది చేయనున్నామని మంత్రి చెప్పారు.
ప్రతీ పార్లమెంటు స్థానంలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉండాలన్ని ప్రభుత్వ నిర్ణయమన్నారు. విజయనగరంలో సుమారు రూ.500 కోట్లతో నిర్మించనున్న ప్రభుత్వ వైద్య కళాశాలకు త్వరలో ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. పార్వతీపురం, భద్రగిరిలో శిశు ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని, విజయనగరంలో రూ.1.96 కోట్లతో సెంట్రల్ డ్రగ్‌స్టోర్‌ను అభివృద్ది చేయనున్నామని తెలిపారు. అదేవిధంగా అన్ని రకాల మౌలిక వసతులను కల్పించి, మున్సిపల్ ప్రాంతాల్లో 355 అర్బన్ క్లీనిక్స్‌ను కొత్తగా నిర్మించనున్నామని చెప్పారు. మరో 205 ఆసుపత్రులను అభివృద్ది చేసి, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 560 అర్బన్ క్లీనిక్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెళ్లడించారు. ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ది, అంకితభావం, పట్టుదల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డికి ఉన్నాయని, ప్రజలకు ఆరోగ్యాన్ని అందించడమే ప్రభుత్వ బాధ్యతగా ఆయన కృతనిశ్చయంతో ఉన్నారని మంత్రి బొత్స పేర్కొన్నారు.
విజయనగరం పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి తన పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అతికొద్ది కాలంలోనే నెరవేర్చారని అన్నారు. గ్రామ సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థలను ఏర్పాటు చేసి, పరిపాలనలో కొత్త సంస్కరణలకు నాంది పలికారని కొనియాడారు.
గజపతినగరం శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి ప్రజలకు ఏది చెప్పినా, చేసి తీరుతారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, తాను పాదయాత్రచేస్తూ గజపతినగరం వచ్చినప్పుడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం, వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన జరిగిందని, ఏడాదిలోగా దీని నిర్మాణం పూర్తి అవుతుందని చెప్పారు. కరోనా కష్టకాలంలో కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన ఘనత జగన్ మోహనరెడ్డికే దక్కిందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్, ఎంఎల్‌సి పెనుమత్స సురేష్‌బాబు, ఎంఎల్ఏలు పీడిక రాజన్నదొర, కడుబండి శ్రీనివాసరావు, జెడ్‌పి సిఇఓ టి.వెంకటేశ్వర్రావు, డిసిహెచ్ఎస్ డాక్టర్ జి.నాగభూషణరావు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆరుణాదేవి, ఎపిఎంఎస్ఐడిసి ఇఇ సత్యప్రభాకర్, తాశీల్దార్ ఎం.అరుణకుమారి, ఎంపిడిఓ కె.కిశోర్‌కుమార్, ఇతర అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు పాల్గొన్నారు.