ఇళ్లపట్టాల కార్యక్రమం విజయవంతం కావాలి..
Ens Balu
2
Visakhapatnam
2020-12-23 19:09:00
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ అధికారులను కోరారు. బుధవారం నాడు ఆయన ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమం పై నియోజకవర్గం ప్రత్యేక అధికారులు, తాహశీల్దారులతో వీడియో కాన్ఫెరెన్సు ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి జనవరి 7వ తేదీ వరకు మండలాలు, గ్రామాల వారీగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని షెడ్యూలు చేసుకోవాలని తెలిపారు. శాసనసభ్యులతో సమన్వయం చేసుకొని కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. అన్ని లేఅవుట్ లలో లెవలింగ్ పనులు, అంతర్గత రోడ్ల ఏర్పాటు సక్రమంగా వుండేలా చూసుకోవాలని తెలిపారు.
నియోజకవర్గ ప్రత్యేక అధికారులు వారి సంబంధిత నియోజకవర్గంలోని తాహశీల్దారులతో కార్యక్రమ నిర్వహణ పై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ సమస్యలను పరిష్కరించాలని కోరారు. వి.ఆర్.ఒ.లు, వి.ఆర్.ఎ.లు., గ్రామ సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లు అందరినీ కార్యక్రమ నిర్వహణలో భాగస్వాములను చేయాలని కోరారు. అన్ని లేఅవుట్ ల వద్ద బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని, లబ్దిదారుల జాబితాను, అనర్హుల జాబితాను సిద్థంగా వుంచుకోవాలని తెలిపారు.
డిసెంబరు 15వ తేదీ వరకు వచ్చిన అన్ని దరఖాస్తులను పరిష్కరించి అర్హులైన వారందరికి ఇళ్లపట్టాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇళ్ల పట్టాల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, వచ్చిన ప్రతి దరఖాస్తును 90 రోజులలోగా పరిష్కరించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలను ఇస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు యం.వేణుగోపాల్ రెడ్డి, పి.అరుణ్ బాబు, డి.ఆర్.ఒ.ప్రసాద్, డ్వామా పి.డి.సందీప్, హౌసింగ్ పి.డి. శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.