ప్రజాసేవలో అనంతజిల్లా ముందుండాలి..
Ens Balu
3
Anantapur
2020-12-23 19:38:00
ప్రజలకు సేవలు అందించడంలో ఆనంతపురాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపే విధంగా పంచాయితీ విస్తరణ అధికారులు, మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శులు పని చేయాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు కోరారు. స్థానిక జెడ్పీ కార్యాలయంలో పంచాయతీ విస్తరణ అధికారులు, మేజర్ గ్రామ పంచాయితీ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ గంధం చంద్రుడు పాల్గొన్నారు. వచ్చే మార్చిలోగా ఇంటి పన్నుల బకాయిల వసూలు పూర్తి చేసి సత్తా చాటాలని ఉద్యోగులకు కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూ సర్వే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలన్నారు. ఎస్సీ,ఎస్టీ కాలనీల పేర్లు మార్పుకు సంబంధించి కాలనీ వాసులు అభిప్రాయ వ్యక్తీకరణకు చర్యలు తీసుకోవాలని అదేశించారు. మంచి నీటి సరఫరా, ఈ- సర్వీసులు అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఉద్యోగులు అలసత్వాన్ని దరిచేయనీయకుండా పనిచేయాలని విజ్ఞప్తి చేసారు. పై అధికారుల పర్యవేక్షణతో సంబంధం లేకుండా ప్రజలకు సేవలు అందించడం అలవర్చుకోవాలన్నారు. జీరో పెండెన్సీ లక్ష్యంగా పని చేయాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలని పంచాయతీ విస్తరణ అధికారులు, మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శులను డీపీవో పార్వతమ్మ కోరారు.