2రోజుల్లో జగనన్నతోడు పూర్తికావాలి..
Ens Balu
4
Anantapur
2020-12-23 19:40:53
అనంతపురం జిల్లాలో రెండు రోజుల్లోగా జగనన్న తోడు, వైయస్సార్ బీమా, పిఎం స్వానిధి పథకాల కింద పెండింగ్లో ఉన్న లబ్ధిదారుల దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేసి వెంటనే వారికి రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. బుధవారం సాయంత్రం డిఆర్డిఎ పిడి నరసింహారెడ్డి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ కామమూర్తి, జిల్లాలోని ఎస్బిఐ బ్రాంచ్ మేనేజర్ లతో జగనన్న తోడు, వైయస్సార్ బీమా, పిఎం స్వానిధి తదితర పథకాలకు సంబంధించి జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రత్యేకంగా జగనన్న తోడు, వైయస్సార్ బీమా, పిఎం స్వానిధి తదితర పథకాలను ప్రారంభించిందన్నారు.
ఆయా ప్రభుత్వ పథకాల కింద ఎవరికైతే రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందో వారికి ఖచ్చితంగా రుణాలు ఇవ్వగలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందులో వైయస్సార్ బీమా కు సంబంధించి ప్రభుత్వం ఎంతో బాధ్యతగా ప్రీమియం, బీమా సౌకర్యం కల్పించేందుకు, జగనన్న తోడు కింద అర్హులైన వారికి రుణాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోగా, బ్యాంకర్లు ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా స్పందించడం లేదని, దీని ద్వారా ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదన్నారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 70 బ్రాంచ్ లలో 30కి పైగా బ్రాంచ్ లలో ఇప్పటివరకూ ఒకరికి కూడా రుణాలు మంజూరు చేయలేదని, మొత్తం 12 వేల దరఖాస్తులలో 8 వేల వరకు దరఖాస్తులు ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నాయన్నారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే రెండు రోజుల్లోగా పూర్తి చేయాల్సిన బాధ్యత ఆయా బ్యాంకు మేనేజర్ల పై ఉందన్నారు. కొన్ని బ్రాంచ్ లలో లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేసినా వాటిని జగనన్న తోడు వెబ్సైట్లో అప్లోడ్ చేయడం లేదని, వెంటనే అప్లోడ్ చేసేలా చూడాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ధర్మవరం, రాయదుర్గం ఎస్బిఐ బ్రాంచ్ లలో ఎక్కువగా పెండింగ్లో దరఖాస్తులు ఉన్నాయని వెంటనే దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేసి రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అలాగే లబ్ధిదారులకు సంబంధించి లోన్ అకౌంట్ క్రియేట్ చేసేందుకు ఎక్కువ సమయం పట్టడం లేదని, అధికారులు ప్రత్యేక దృష్టి సారించి లోన్ అకౌంట్ క్రియేట్ చేయాలన్నారు. అలాగే పిఎం స్వానిధి పథకం కింద అర్హులైన చిరు వ్యాపారులకు రుణాలు మంజూరు చేసేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.