నిర్మాణ పనుల్లో అలసత్వం వహిస్తే చర్యలే..
Ens Balu
2
Vizianagaram
2020-12-23 19:55:15
విజయనగరం జిల్లాలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. దీనికోసం రెండు రోజుల్లో సమగ్ర ప్రణాళికను రూపొందించాలని ఆయన సూచించారు. సాగునీటి ప్రాజెక్టు పనులపై ఆయన కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ మాట్లాడుతూ, జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు తదితర అంశాలను ఆయా ప్రాజెక్టుల వారీగా వివరించారు. విజయనగరం లాంటి జిల్లాకు సాగునీరు, వ్యవసాయం అత్యంత ప్రాధాన్యతాంశాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మంత్రి బొత్స సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నారని చెప్పారు.
మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో తీవ్రమైన జాప్యం జరుగుతోందని, ఇరిగేషన్ అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎంతో సానుకూలంగా ఉన్నప్పటికీ, ప్రాజెక్టులు ఏమాత్రం ముందుకు సాగడం లేదని అన్నారు. తోటపల్లి ప్రాజెక్టుకు సంబంధించి గతంలో తన హయాంలోనే సుమారు 80శాతం పనులు పూర్తి అయ్యాయని, గత ప్రభుత్వ హయాంలో మరో 12 శాతం పనులు జరిగాయని, మిగిలిన పనులను ఎప్పటికి పూర్తి చేస్తారని ప్రశ్నించారు. తారకరామ తీర్ధసాగర్ ప్రాజెక్టు విషయంలో కూడా అధికారులు నిర్లిప్తతను ప్రదర్శిస్తున్నారని అన్నారు. జిల్లాలో మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఏమైనా సమస్యలుంటే, జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి పరిష్కరించుకొనేందుకు రెండు రోజుల్లో సమగ్ర నివేదిక తయారు చేయాలని మంత్రి ఆదేశించారు.
ఈ సమావేశంలో ఎంపి బెల్లాన చంద్రశేఖర్, ఎంఎల్ఏ బొత్స అప్పలనరసయ్య, జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్, సబ్ కలెక్టర్ విదేహ ఖరే, డిఆర్ఓ ఎం.గణపతిరావు, ఆర్‌డిఓ బిహెచ్ భవానీశంకర్, వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, స్పెషల్ డిప్యుటీ కలెక్టర్లు, వివిధ ప్రాజెక్టుల ఎస్ఇలు, ఇఇ లు, డిఇలు పాల్గొన్నారు.