ఎంఎస్ఎంఈలకు అధిక ప్రోత్సాహం..
Ens Balu
3
Kakinada
2020-12-23 19:58:30
తూర్పుగోదావరి జిల్లాలో సూక్ష్మ పరిశ్రమల ప్రోత్సాహక కార్యక్రమం (ఎంఈపీపీ) ద్వారా జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించి, ప్రోత్సహిస్తున్నట్లు జెసి (సంక్షేమం) జి.రాజకుమారి తెలిపారు. భారతీయ లఘు పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సిడ్బీ) సహకారంతో చిన్న తరహా పరిశ్రమల ప్రోత్సాహక, అభివృద్ధి సంస్థ (మెప్డా) ద్వారా ఈ కార్యక్రమం అమలవుతున్నట్లు వివరించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్.. మూడు యూనిట్లకు సంబంధించి నలుగురు మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రూ.40 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ మహిళలు బేకరీ ఉత్పత్తులు, శానిటరీ న్యాప్‌కిన్స్, ఫోం క్లాత్ బెడ్స్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బేకరీ ఉత్పత్తుల యూనిట్‌కు రూ.25 లక్షలు, శానిటరీ న్యాప్‌కిన్స్ యూనిట్‌కు రూ.5 లక్షలు, ఫోం క్లాత్ బెడ్స్ యూనిట్‌కు రూ.10 లక్షలు అందించినట్లు వెల్లడించారు. ఈ యూనిట్ల ద్వారా 75 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులు రుణ సహాయం అందించినట్లు జాయింట్ తెలిపారు. సమన్వయంతో వ్యవహరించి సూక్ష్మ పరిశ్రమల ప్రోత్సాహక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా జేసీ జి.రాజకుమారి అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సిడ్బీ ఏజీఎం (న్యూఢిల్లీ) దినేష్ ప్రసాద్, మెప్డా సీఎండీ, సీఈవో ఎస్.జగన్నాథరాజు తదితరులు పాల్గొన్నారు.