రబీలో నీటిఎద్దడి లేకుండా చూడాలి..


Ens Balu
2
Srikakulam
2020-12-23 20:18:54

రబీలో వ్యవసాయానికి నీటి ఎద్దడి లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ నీటిపారుదల, వ్యవసాయ,  అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జలవనరులు, వ్యవసాయ శాఖ అధికారుల సమన్వయ సమావేశం జిల్లా  కలెక్టర్ అధ్యక్షతన  జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రబీలో వ్యవసాయ నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎట్టి పరిస్థితిల్లోనూ రబీలో వ్యవసాయ పంటలకు నీటి ఎద్దడి లేకుండా చూడాలని, పశుదాహార్తిని తీర్చాలని పేర్కొన్నారు. వంశధార ఎడమ ప్రధాన కాలువ (23ఆర్ డిస్ట్రిబ్యూటరీ ) ద్వారా హిరమండలం, సారవకోట, జలుమూరు మండలాల్లోని సుమారు 2,500 ఎకరాలకు రబీలో ఆరుతడి పంటలకు నీటిని అందించే అవకాశముందని కలెక్టర్  పేర్కొన్నారు. రానున్న సంక్రాంతి, వేసవిని  దృష్టిలో ఉంచుకొని వ్యవసాయం, పశుదాహార్తి నిమిత్తం వంశధార కుడి, ఎడమ కాలువల ద్వారా నీటిని విడుదల చేయుటకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.  అలాగే రెండవ పంటకు గొట్టా బేరేజీ ద్వారా నీటి నిల్వలు బట్టి దిగువకు విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదైన కారణంగా రిజర్వాయరులో తగినంత నీటి నిల్వ లేదని, దీన్ని దృష్టిలో ఉంచుకొని  రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని చెప్పారు.  రబీలో 400 క్యూసెక్కుల నీటిని  మాత్రమే విడుదల చేసే అవకాశం ఉన్నందున ఈ విషయాన్ని రైతులు గమనించాలని కలెక్టర్ కోరారు. వ్యవసాయ అధికారులు రైతులకు ఈ విషయాలను వివరించాలని,  నీటిని విడిచిపెట్టేముందు పొలాల్లో ధాన్యం నిల్వలు లేకుండా రైతులకు ముందుగానే సమాచారాన్ని అందించాలని కలెక్టర్ ఆదేశించారు. కాలువలకు మరమ్మతు పనులను  యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ తెలిపారు.ఈ సమీక్ష సమావేశంలో పర్యవేక్షక ఇంజినీర్లు డోల తిరుమల రావు, ఎస్.సి.రమణరావు, నరసన్నపేట, టెక్కలి , హిరమండలం, ఆమదాలవలస ఉపకార్య నిర్వాహకఇంజినీర్లు,  కార్యనిర్వాహక ఇంజినీర్లు, నీటిపారుదల శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ డి.శ్రీనివాస్, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్లు రామచంద్రరావు, శ్రీకాంత్, రామకృష్ణ , ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.