29వేల మంది లబ్దిదారులకు ఇళ్ల పంపిణీ..
Ens Balu
2
Kakinada
2020-12-23 20:37:11
నవరత్నాల్లో భాగంగా కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో 29 వేల మంది లబ్దిదారులకు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేయనున్నట్టు రాష్ట్ర వ్యవసాయ, సహకార, ఫుడ్ ప్రొసెసింగ్,మార్కెటింగ్ శాఖా మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. బుధవారం కాకీనాడబోట్ క్లబ్ దగ్గరలో ఉన్న కృషి భవన్ లో నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం పై కాకినాడ గ్రామీణ నియోజకవర్గ స్ధాయి సమీక్షా సమావేశానికి మంత్రి కన్నబాబు, కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీత ముఖ్యఅతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకినాడ గ్రామీణ నియోజకవర్గం పరిధిలో ఇళ్ళ పట్టాల పంపిణీ, 25న జిల్లాలో జరిగే ముఖ్యమంత్రి పర్యటన తదితర అంశాలపై సంబంధిత అధికారులతో మంత్రి కన్నబాబు సమీక్షించి ముఖ్యమంత్రి పర్యటనను అధికారులు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని ఆయన సూచించారు.
అనంతరం పాత్రికేయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాత్రికేయులను ఉద్దేశించి మంత్రి కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల సొంత ఇంటి కల నెరవేర్చాలనే ఉద్దేశ్యంతో వేల కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 30 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.ఎంతటి విపత్కర పరిస్ధితులు ఎదురైన రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఆపద సమయంలో అన్ని వర్గాల వారిని ఆదుకున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ళ స్ధలాలకు సంబంధించి అన్నిలేవుట్లలో త్రాగునీరు, విద్యుత్, రవాణా, ఇతర అన్ని మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. అర్హతలు ఉండి గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్న వారందరికీ 90 రోజుల్లోనే ఇళ్ళ పట్టాలు అందజేయడం జరిగిందన్నారు. ఇళ్ళ స్ధలాలకు సంబంధించి అత్యంత పారదర్శకంగా లబ్దిదారులను ఎంపిక చేసి ప్లాట్లను లాటరీ ద్వారా కేటాయించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం లబ్దిదారుల జాబితా ప్రతీ గ్రామ సచివాలయంలోను ప్రదర్శించడం జరిగిందన్నారు. కాకినాడ గ్రామీణ నియోజకవర్గానికి సంబంధించి సుమారుగా 29 వేల మంది లబ్దిదారులకు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి రైతుల సంక్షేమమే ధ్యేయంగా, రైతు పక్షపాతిగా నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులందరికీ ఈ నెల 29వ తేదీన ప్రభుత్వం నష్టపరిహారం అందించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. నష్టపరిహారానికి దరఖాస్తు చేసుకొనేందుకు రైతులకు ఈ నెల 24వ తేదీ సాయంత్రం వరకు గడువు ఉందన్నారు. నివర్ తుపాన్ కారణంగా 12 లక్షల ఒక వెయ్యి ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, ఇ-క్రాప్ లో నమోదైన ప్రతీ రైతుకు నష్టపరిహారం అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ తుఫానులు, భారీ వర్షాలు, వరదలు కారణంగా అధిక నష్టం జరిగిందని ఆయన తెలిపారు. వచ్చే సంవత్సరం నుండి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బీమా సంస్ధను ఏర్పాటు చేసి రైతులకు నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
ఈ సమావేశంలో కాకినాడ రూరల్, కరప మండలాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.