సుందరమైన పార్కుగా పెద్దపాడు చెరువు..
Ens Balu
2
Srikakulam
2020-12-24 12:14:33
శ్రీకాకుళం నగరంలోని పెద్దపాడు చెరువును త్వరలో సుందరంగా, ఆహ్లాదకరమైన పార్కుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక పెద్దపాడు ప్రాంతంలోని చెరువును జిల్లా అధికారులు, గ్రామ పెద్దలతో కలిసి కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీకాకుళం పట్టణంలో గల పెద్దపాడు చెరువు 37 ఎకరాల విస్తీర్ణంలో ఉందని, దీన్ని త్వరలో సుందరంగా, ఆహ్లాదకరమైన పార్కుగా తీర్చిదిద్ది పెద్దపాడు గ్రామ ప్రజలతో పాటు పట్టణ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధిత అధికారులు, పారిశ్రామికవేత్తలు, గ్రామ పెద్దలు, ప్రజల సూచనలు, సలహాలను కోరడం జరిగిందని అన్నారు. వారి సలహా, సూచనలతో ఎవరికీ ఇబ్బంది కలుగకుండా వీలైనంత త్వరగా పెద్దపాడు చెరువును విహార స్థలంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఇందులో పిల్లలు, పెద్దలు విహరించేందుకు బోటు షికార్, చిన్నారులు ఆడుకునేందుకు ఆట పరికరాలు, ఇతర ఏర్పాట్లతో పాటు ప్రజలు నడిచేందుకు వీలుగా ఫ్రత్యేక మార్గాన్ని కూడా ఏర్పాటుచేయనున్నట్లు కలెక్టర్ వివరించారు.
ఈ పర్యటన కార్యక్రమంలో జిల్లా నీటియాజమాన్య సంస్థ పథక సంచాలకులు హెచ్.కూర్మారావు, రెవిన్యూ డివిజనల్ అధికారి ఐ.కిశోర్, ఏ.పి.ట్రాన్స్ కో పర్యవేక్షక ఇంజినీర్ యన్.రమేష్, ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ జోనల్ మేనేజర్ జి.మంగమ్మ, కార్యనిర్వాహక ఇంజినీర్ పి.సుగుణాకరరావు, దుప్పల వెంకటరావు, నటుకుల మోహన్, రొటేరీయన్ సి.వి.రాజులు, స్థానిక నాయకులు కలగ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.