స్నేహలత కుటుంబానికి అండగా ఉంటాం..
Ens Balu
2
Anantapur
2020-12-24 14:07:14
స్నేహలత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. జిల్లాలో ఒక రోజు పర్యటనలో భాగంగా గురువారం స్థానిక అశోక్ నగర్ కు చెందిన హత్యకు గురైన స్నేహలత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియపరిచారు. అంతకుమునుపు ఆమె స్నేహలత మృతదేహానికి నివాళులర్పించారు. ధర్మవరం మండలం బాదనపల్లి వద్ద బుధవారం హత్యకు గురయిన స్నేహలత తల్లిదండ్రులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియ పరిచారు. ఈ కార్యక్రమంలో అనంతపురం పార్లమెంటు సభ్యులు తలారి రంగయ్య, స్థానిక శాసనసభ్యులు అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పత్రికా సమావేశంలో వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ నిందితులను కఠినంగా శిక్షించడం జరుగుతుందన్నారు. కేసు విచారణ వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఈ సంఘటన కలిచి వేసిందన్నారు. ఈ కేసుని వేగవంతంగా పరిష్కరించడానికి మా కమిషన్ కృషి చేస్తుందన్నారు. స్నేహలత ధర్మవరంలో స్టేట్ బ్యాంకు లో పొరుగు సేవల ఉద్యోగం చేస్తూ ఉన్నదని తెలిపారు. స్నేహలత మంచి హాకీ క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నదని, జాతీయస్థాయిలో క్రీడలలో అనేక పథకాలు సాధించడం జరిగిందని తెలిపారు. ఇటువంటి ఆణిముత్యంను పోగొట్టుకోవడం చాలా దురదృష్టమని ఆమె ఆవేదన చెందారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టడానికి మా కమిషన్ ప్రత్యేక చట్టం తీసుకురావడానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే నిందితులను అరెస్టు చేయడం జరిగిందని, వారిపైన కఠినమైన సెక్షన్లు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. దిశ చట్టం అమలు చేస్తున్నామని, 24 గంటల్లో ప్రతి కేసుకు సంబంధించి నిందితులను అరెస్టు చేయడం జరుగుతుందని, వారం రోజుల్లో కేసుల విచారణ కార్యక్రమం వేగవంతంగా జరుగుతుందన్నారు. ఈ సంఘటన సంబంధించిన అన్ని విషయాలపై డిఐజి గారితో చర్చించి నిందితులకు కఠినమైన శిక్షలు అమలు చేయడానికి మా కమిషన్ చర్యలు చేపడుతుందన్నారు. మహిళా సంరక్షణ కార్యదర్శులను ప్రతి గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేయడం జరిగిందని, గ్రామాలలో ఆకతాయిలుగా ఉన్న అబ్బాయిలను గుర్తించి బాలికలను ఏడిపిస్తున్న అంశాలపై దృష్టి పెట్టి చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో 100 రోజుల పాటు పలు కార్యక్రమాలలో భాగంగా ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తూ ఉన్నది తెలిపారు. గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలని, ప్రతి అబ్బాయి మనసు మారాలని, మనం అందరం కలిసికట్టుగా కృషి చేయాలని ఆమె తెలిపారు.
అనంతరం స్థానిక శాసనసభ్యులు అనంత వెంకట రామిరెడ్డి మాట్లాడుతూ ఇటువంటి సంఘటన జరగడం సమాజానికి సిగ్గుచేటని పేర్కొన్నారు. ఎస్పీ పర్యవేక్షణలో ఈ కేసు విచారణ వేగవంతంగా చేయడం జరుగుతుందన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సిడబ్ల్యుసి చైర్ పర్సన్ నల్లాని రాజేశ్వరి, జిల్లా సంయుక్త కలెక్టర్ ( సంక్షేమం మరియు అభివృద్ధి) ఏ.సిరి, సంయుక్త కలెక్టర్ ( ఆసరా మరియు సంక్షేమం) గంగాధర్ గౌడ్, ఆర్డీవో గుణభూషణ్ రెడ్డి, ఐసిడిఎస్ పీడీ విజయలక్ష్మి. సాంఘిక సంక్షేమ శాఖ డిడి విశ్వ మోహన్ రెడ్డి, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.