టిడ్కో ఇళ్ల పంపిణీని స్వాగతిస్తున్నాం..
Ens Balu
1
Visakhapatnam
2020-12-24 16:35:41
టిడిపి ప్రభుత్వ హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లను ప్రభుత్వం ప్రజలకు పంపిణీ చేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్ డీ నజీర్ అన్నారు. గురువారం విశాఖలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టిడ్కో ఇళ్లను పంపిణీ చెయ్యకపోతే సంక్రాంతికి లబ్దిదారులందరినీ ఏకంచేసి తెలుగుదేశం ఆధ్వర్యంలో పంపిణీ చేస్తామని హెచ్చరించిన నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం ఇళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టిందని తెలిపారు. సొమ్మొకడిది సోకొకడిది అన్న రీతిలో తెలుగుదేశం నిర్మించిన టిడ్కో ఇళ్లను వైసీపీ పంపిణీ చేస్తోందని ఎద్దేవా చేసారు. దాదాపు రెండు లక్షల అరవై రెండు వేల రెండువందల పదహారు ఇళ్లను తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మించినట్లు తెలిపారు. అర్హులందరికీ ఇవ్వాలని అనేక మార్లు విజ్ఞప్తి చేస్తే దాదాపు పద్దెనిమిది నెలలుగా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అధికారం చేపట్టి దాదాపు రెండేళ్ళైనా కనీసం రెండు ఇళ్ళు కూడా కట్టలేకపోయారన్నారు. అలాగే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కూడా చేపడుతున్నారని, తెలుగుదేశం హయాంలో దాదాపు అరవై వేల ఎకరాలను సేకరించామన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు ఇళ్ల పట్టాల భూసేకరణలో దాదాపు నాలుగువేల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని దోచుకున్నారని నజీర్ ఆరోపించారు. పావలా పనిచేసి ముప్పావలా దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఇప్పటికైనా సక్రమంగా లబ్దిదారులను ఎంపికచేసి అర్హులైన ప్రతీవారికీ టిడ్కో ఇళ్ళు లేదా ఇళ్ల పట్టాలను పారదర్శకంగా పంపిణీ చెయ్యాలని డిమాండ్ చేసారు. రాష్ట్ర సమావేశంలో అబ్దుల్ చిన్నరెహమాన్,దొడ్డిరామానంద్,నడిగట్లశంకర్రావు,ఉరికుటిపైడిరాజు,షేక్ రహంతుల్లా, మహమ్మద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు.