వినియోగదారులు చైతన్యం కావాలి..


Ens Balu
3
Anantapur
2020-12-24 16:41:35

వినియోగదారులు ఎంతో చైతన్యవంతంగా ఉన్నరోజునే సమస్యల నుంచి బయటపడానికి అవకాశం వుంటుందని జెసి నిశాంత్ కుమార్ అన్నారు. గురువారం అనంతపురం  కలెక్టరేట్  ఆవరణంలోని రెవెన్యూ భవన్ లో వినియోగ దారుల హక్కు చట్టం-2019 పై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా పౌర సంబంధాల శాఖ నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా జెసి హాజరయ్యారు. దేశంలో వినియోగదారుడు వస్తువులు కొనుగోలు చేసే ప్రక్రియలో మార్పులు చోటు చేసుకుంటున్నందున వాళ్ల హక్కులను కాపాడేందుకు జాతీయ వినియోగ దారుల చట్టం-2019 ని తీసుకొచ్చారనీ.. చట్టం ద్వారా పొందిన హక్కుల గురించి ప్రజలు అవగాహన పెంచుకోవాలని జేసీ నిశాంత్ కుమార్ కోరారు. నూతన చట్టం ద్వారా ఆన్ లైన్ లో అమ్మకాలు చేపట్టేవారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. వినియోగ దారుల హక్కుల కోసం దేశ స్థాయిలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. జిల్లా వినియోగదారుల ఫోరం విచారణ పరిధిని పెంచారన్నారు. గతంలో రూ.20 లక్షల వరకూ జరిగిన కొనుగోలుపై మాత్రమే విచారణ జరిపేందుకు వినియోగ దారుల ఫోరంకు అవకాశం ఉండగా.. నూతన చట్టంలో కోటి రూపాయల వరకూ పరిధి పెంచారన్నారు. చదువుకునే రోజుల్లో వినియోగ దారుల హక్కు చట్టం-1986 ద్వారా సెల్ ఫోన్ పాడైపోయిన అంశంలో న్యాయపోరాటం చేసి కొత్త  సెల్ ఫోన్ తో పాటూ న్యాయ పోరాటానికి అయిన ఖర్చులు కూడా పొందిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. వినియోగ దారులు తమ హక్కులను డిమాండ్ చేయగలిగితేనే అమ్మకందారులు నాణ్యమైన సరుకులు, సేవలు అందించడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో తూనికల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ స్వామి ప్రసంగించారు. తూనికల శాఖ తూనికల్లో, నాణ్యతలో మోసాలు చేసేవారిపై చర్యలు తీసుకోగలుగుతుందే కానీ మోసపోయిన వినియోగదారుడికి న్యాయం చేయలేదనీ.. వారికి న్యాయం చేసేందుకే వినియోగదారుల హక్కుల చట్టం ఉందన్నారు. మనకు ఏదైనా సమస్య వస్తే దాని పరిష్కారం కోసం ఎవరిని సంప్రదించాలో తెలియడమే అవగాహన అనీ.. ప్రజలు జిల్లాలోని ఏ సమస్యకైనా పరిష్కారం కోసం ఎవరిని సంప్రదించాలో తెలియకపోతే జిల్లా సమాచార కేంద్రాలను సంప్రదిస్తే సరిపోతుందన్నారు. ఏ సమాచారం లేనివారికి జిల్లా సమాచార కేంద్రం అండగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా సరఫరాల అధికారి రఘురామి రెడ్డి, పౌర సరఫరాల శాఖ డీఎం మోహన్ ప్రసాద్, డీసీఐసీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, డీసీఐసీ సెక్రెటరీ నబీ రసూల్, ఇండియన్ ఆయిల్ సేల్స్ ఆఫీసర్ సిద్దార్థ్ పాత్రా, హెచ్.పీ.సీ.ఎల్ సేల్స్ ఆఫీసర్(ఎల్పీజీ) అనుశూల్ తదితరులు పాల్గొన్నారు.